Begin typing your search above and press return to search.

ఊపందుకుంటున్న ఓటీటీ రిలీజులు..!

By:  Tupaki Desk   |   7 Aug 2021 11:30 PM GMT
ఊపందుకుంటున్న ఓటీటీ రిలీజులు..!
X
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో థియేటర్లు మూతబడి ఉండటంతో జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వేదికలను ఆశ్రయించారు. అదే సమయంలో ఆర్థిక భారం పడుతుండటంతో ఫిలిం మేకర్స్ కూడా ఓటీటీలలో సినిమాలను రిలీజ్ చేయడం ప్రారంభించారు. అప్పుడు మొదలైన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ముందుగా చిన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ కు వెళ్లగా.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ బాట పడుతున్నాయి. దీనికి టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు.

ఇండియాలో గత రెండేళ్లలో ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌లు చూసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో డిజిటల్ వేదికలు నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తూ సినిమాలను కొనుగోలు చేస్తున్నారు. అమెజాన్ - నెట్‌ ఫ్లిక్స్ - డిస్నీ+హాట్‌ స్టార్ - ఆహా - జీ5 - స్పార్క్ వంటి ఓటీటీలు తెలుగు కంటెంట్ అందించడంలో ముందున్నాయి. కోవిడ్ సమయంలో అనేక చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో ఓటీటీ విడుదలకు బ్రేక్ పడుతుందని అందరూ అనుకున్నారు.

అయితే సినిమాలు చూడటానికి జనాలు థియేటర్ లకు వస్తారా లేదా అనే సందేహంతో.. చాలామంది నిర్మాతలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఇచ్చే ఫ్యాన్సీ ఆఫర్స్ కు ఓకే చెబుతున్నారని తెలుస్తోంది. కోవిడ్ సమయాల్లో కలెక్షన్ల గురించి ఆలోచించకుండా సేఫ్ గా టేబుల్ ప్రాఫిట్ తో సినిమాలను ఓటీటీలకు ఇస్తున్నారు. ఇటీవలే వెంకటేష్ నటించిన 'నారప్ప' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. అలానే 'దృశ్యం 2' తెలుగు రీమేక్ ని డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. నితిన్ 'మాస్ట్రో' చిత్రాన్ని కూడా డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుందని ఓటీటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇతర భాషల విషయానికి వెళ్తే.. హిందీ సినిమాలైన 'షేర్షా' 'భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' సినిమాలు ఆగస్టు నెలలో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అలానే తమిళ్ లో నయనతార ‘నెట్రికాన్’ - ఐశ్వర్య రాజేష్ ‘భూమిక’ - విజయ్ సేతుపతి - రాశీఖన్నా ల ‘తుగ్లక్ దర్బార్’ చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇక సూర్య నిర్మించే నాలుగు సినిమాలను అమెజాన్ ప్రైమ్ కు అమ్మేశారు. ఇందులో 'జై భీమ్' సినిమా కూడా ఉంది. వీటితో పాటుగా మరికొన్ని తెలుగు మలయాళ కన్నడ తమిళ హిందీ చిత్రాల ఓటీటీ డీల్స్ జరుగుతున్నాయి.

తెలుగులో ఓటీటీ రిలీజులు ఊపందుకోవడం పై టాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు హ్యాపీగా లేరని తెలుస్తోంది. ఓటీటీ సంస్కృతి పెరగడం వల్ల సినిమా వ్యాపారం దెబ్బ తింటుందని.. ఇలానే కొనసాగితే భవిష్యత్ లో ఓటీటీలకు కూడా సినిమాలను తక్కువ లాభాలకు అమ్మాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాదు థియేటర్ వ్యవస్థ దెబ్బ తిని, ప్రేక్షకులు పూర్తిగా థియేట్రికల్ ఎక్సపీరియన్స్ కు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే స్టార్ డమ్ - సక్సెస్ - సక్సెస్ రేట్ వంటివి మర్చిపోవాల్సి ఉంటుంది.

కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సైతం ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ సిస్టమ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిర్మాతలకు ఉందని పేర్కొన్నారు. థియేటర్ బిజినెస్ ని నాశనం అవ్వకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిదని.. నిర్మాతలు డిజిటల్ రిలీజ్ లకు వెళ్ళొద్దని కోరారు. మరి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.