Begin typing your search above and press return to search.

#క‌రోనా క‌ల్లోలం ఓటీటీకి క‌లిసొస్తోందా?

By:  Tupaki Desk   |   16 March 2020 11:18 AM IST
#క‌రోనా క‌ల్లోలం ఓటీటీకి క‌లిసొస్తోందా?
X
క‌రోనా వైర‌స్ దెబ్బ‌కి ప్ర‌పంచం అష్ట‌దిగ్భంధ‌నం అయ్యింది. విదేశీ ప్ర‌యాణాలు బంద్ అయ్యాయి. ఇటు రాలేరు... అటు పోలేరు. ఎక్క‌డివారు అక్క‌డే గ‌ప్ చుప్. ఇక‌ తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అదే ప‌రిస్థితి. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే గ‌ప్ చుప్. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప‌ ఇల్లు క‌దిలి అడుగు వేయొద్ద‌నేది అధికారుల ఆదేశం. గ‌డ‌ప దాటితే క‌రోనాని కొని తెచ్చుకున్న‌ట్లేన‌ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే హెచ్చ‌రించాయి. వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్టాలంటే అదొక్క‌డే మార్గ‌మ‌ని దృఢంగా సంక‌ల్పించిన క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారంతా.

స‌భ‌లు..స‌మావేశాల్లేవ్. సినిమా థియేట‌ర్లుబంద్....యూనివ‌ర్శీటీలు..స్కూల్స్...కాలేజ్...ప‌బ్ లు..రెస్టారెంట్లు.. స్విమ్మింగ్ పూల్స్..రిసార్ట్స్ ..ర‌ద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ అన్ని మూత‌ప‌డ్డాయి. దాదాపు అన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోమ్ ఫెసిలిటీని క‌ల్పించాయి. ప్ర‌స్తుతం మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల్లో ఎక్క‌డా గ‌డ‌ప‌దాటానికి వీలు లేని స‌న్నివేశం ఎదురైంది. అయితే కొవిడ్-19 ఎఫెక్టును ఆన్ లైన్ డిజిటిల్ స్ట్రీమింగ్ సంస్థ‌లు ఎన్ క్యాష్ చేసుకోబోతున్నాయి. ఇప్ప‌టికే టిజిట‌ల్ విప్ల‌వంలో దూసుకుపోతున్న నెట్ ప్లిక్స్..అమోజాన్.. హులూ లాంటి ఓటీటీ సంస్థ‌లు ఇప్పుడు త‌మ స‌బ్ స్క్రైబ‌ర్స్ ని పెంచుకునే ప‌నిలో ప‌డ‌టం ఖాయం. తెలుగులో ఇటీవ‌లే నిర్మాత అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో ఓటీటీలోకి అడుగు పెట్టిన నేప‌థ్యం లో దీనికీ కొంత క‌లిసొచ్చే ఛాన్సుంద‌ని భావిస్తున్నారు. వినోదాన్ని పంచే థియేట‌ర్లు బంద్ చేసారు కాబ‌ట్టి ఇప్పుడు అంతా ఓటీటీ పైనే ప‌డ‌తారు. ఆ ర‌కంగా స‌బ్ స్క్రైబ‌ర్స్ పెరిగే ఛాన్సుంటుంది.

ఇల్లు క‌ద‌ల‌కుండా వినోదాన్ని పంచే సాధ‌నం అదొక్క‌టే కాబ‌ట్టి ఓటీటీ- డిజిట‌ల్ ని ఆహ్వానించ‌క త‌ప్ప‌దు. ద‌క్షిణాదిన మిగ‌తా రాష్టాల కంటే సినిమా ప్రియులు ఎక్కువే కాబ‌ట్టి ఓటీటీ యాజ‌మాన్యాల‌కు క‌రోనా ఎఫెక్ట్ చ‌క్క‌ని అవ‌కాశంగానే భావిస్తున్నారు. కొత్త కొత్త సినిమాలు...వెబ్ సిరీస్ లు...ఎక్స్ క్లూజివ్ రియాల్టీ షోలు లాంటివి వీలైన‌న్న‌ది అందుబాటులోకి తీసుకొచ్చి ఓటీటీని జానాల‌కి ఎక్కిస్తే ఈనెల రోజుల్లో కోట్లాది రూపాయ‌ల వ్యాపారం జ‌రిగే ఛాన్స్ ఉంది. ఇక్క‌డ మ‌రో ప్ర‌మాదం కూడా పొంచి ఉంది. ఒక్క‌సారి ఓటీటీకి అలవాటు ప‌డితే మ‌ళ్లీ ప్రేక్ష‌కులు థియేట‌ర్ వైపు చూడ‌టం క‌ష్ట‌మేన‌నేది నిపుణుల అభిప్రాయం. సినిమా కోసం అంటూ థియేట‌ర్ కు వ‌చ్చేంత స‌మ‌యాన్ని వెచ్చించ‌చానికి ఇష్ట‌ ప‌డ‌రని అంటున్నారు. ఏదైనా ఒక్క‌సారి అల‌వాటైతే? ఆ హ్యాంగోవ‌ర్ నుంచి తొంద‌ర‌గా బ‌య‌ట‌కు రాలేర‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. మ‌రి తెలుగు ఓటీటీ కూడా అంత‌గా అడిక్ట్ చేస్తుందంటారా?