Begin typing your search above and press return to search.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పెట్టే కండిషన్స్ మన హీరోలకు నచ్చడం లేదా...?

By:  Tupaki Desk   |   15 April 2020 10:30 PM GMT
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పెట్టే కండిషన్స్ మన హీరోలకు నచ్చడం లేదా...?
X
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో మూడు వారాలు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చేలా కనబడటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్‌లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, జీ5, సన్ నెక్స్ట్, ఆహా, ఎరోస్ మొదలైన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్.. విడుద‌ల‌కు రెడీ అయిన సినిమాల్ని త‌మ వైపుకు లాక్కోవాల‌ని చూస్తున్నాయి. మంచి రేట్ల‌తో ఆకర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయట. సినిమాల్ని డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్స్ లో విడుద‌ల చేసుకోవ‌డానికి నిర్మాత‌లు సిద్ధ‌మే... కానీ హీరోలే రెడీగా లేరట. దానికి కారణం ఈ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పెట్టే కండిషన్స్ మన హీరోలకు న‌చ్చ‌డం లేదని సమాచారం.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమా స్ట్రీమింగ్ అవ్వ‌డానికి ముందు.. హీరోహీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలని కండిషన్స్ పెడుతున్నాయట. సినిమా థియేటర్లలో విడుద‌ల‌ చేయడానికి ముందు హీరోహీరోయిన్లు ద‌ర్శ‌కులు ప‌బ్లిసిటీలో బిజీగా ఉంటారు. ఆ ప్రచారం ఏదో త‌మ‌కు చేసి పెట్టాల‌న్న‌ది ఓటీటీ పెడుతున్న కండిషన్. ఫేస్ బుక్ లైవ్ ల ద్వారా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం.. ఏ రోజున సినిమా రాబోతోందో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం.. ఇలాంటివి అన్నమాట. అంతేకాకుండా న్యూస్ పేపర్స్ లో, టీవీల్లోనూ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవ్వ‌బోతోందో అని ఇచ్చే యాడ్స్ ఖర్చు నిర్మాత‌లే భ‌రించాలట. యాడ్స్ ఇవ్వ‌డానికి నిర్మాత‌ల‌కు అభ్యంత‌రం లేక‌పోవొచ్చు. అయితే హీరోలు మాత్రం ప‌బ్లిసిటీకి నో అంటున్నారట. ధియేట‌ర్లో సినిమా విడుద‌ల చేస్తానంటే ఎంతైనా ప‌బ్లిసిటీ చేస్తాం.. కానీ ఇలా ఓటీటీకి పబ్లిసిటీ ఇవ్వమంటే కుదరదని తెగేసి చెప్తున్నారట. దాంతో నిర్మాత‌ల‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదట.

దీనిపై టాలీవుడ్ లోని నిర్మాతలు అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారట. ఈ డిస్కషన్ లో సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి అమ్మడం గురించి.. వాటి కండిషన్స్ గురించి.. వాటిపై హీరోలను ఎలా ఒప్పించాలా అని చర్చించారట. కొంత‌కాలం వేచి చూసే ధోర‌ణే మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప‌బ్లిసిటీ విష‌యంలో ఓటీటీలు హీరోల‌పై ఒత్తిడి తీసుకురాక‌పోతే… ఈ స‌మ‌స్య నుంచి నిర్మాత‌లు గ‌ట్టెక్కిన‌ట్టే. హీరోలూ పెద్ద మ‌న‌సు చేసుకుని ఆ ఆన్‌లైన్ ప్ర‌మోష‌న్లు ఒప్పుకుంటే ఎలాంటి గొడ‌వా ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.