Begin typing your search above and press return to search.

'ఊ అంటావా.. ఊఊ అంటావా' మేల్ వెర్సన్..!

By:  Tupaki Desk   |   16 Dec 2021 3:30 PM GMT
ఊ అంటావా.. ఊఊ అంటావా మేల్ వెర్సన్..!
X
అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అనే ఐటెమ్ నంబర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. 45 మిలియన్లకు పైగా వ్యూస్.. 1 మిలియన్ లైక్స్ తో యూట్యూబ్‌ టాప్ ట్రెండ్స్ లో కొనసాగుతోంది.

దేవిశ్రీప్రసాద్ ట్యూన్.. ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ వాయిస్.. మగాళ్ల బుద్ధి వంకర అనే అర్థంలో లిరిసిస్ట్ చంద్రబోస్ రాసిన సాహిత్యం.. ఇందులో సమంత హాట్ హాట్ స్టెప్పులు అన్నీ కలిపి ఈ ఐటెమ్ సాంగ్ ను వైరల్ చేశాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో 'ఊ అంటావా' పాట మీద వేల కొలదీ రీల్స్ దర్శనమిస్తున్నాయి. ఇదే క్రమంలో ఈ పాటకు మేల్ వెర్సన్ గా 'ఊ అంటావా పాపా.. ఊఊ అంటావా పాపా' బయటకు వచ్చింది.

ఓ నెటిజన్ తనకున్న సినిమా నాలెడ్జ్ ని ఎడిటింగ్ టెక్నిక్ ని టెక్నాలజీని ఉపయోగించి 'ఊ అంటావా పాపా..' సాంగ్ రెడీ చేశాడు. ఒరిజినల్‌ వెర్షన్‌ ట్యూన్ ని తీసుకొని.. చంద్రబోస్ సాహిత్యానికి పేరడీగా ఆడవాళ్ళ బుద్ధి వంకర బుద్ధి అనే అర్థంలో ఈ పాట రాసాడు. రాయడమే కాదు తనే స్వయంగా ఆలపించాడు. 'తమ్ముడు' 'అత్తారింటికి దారేది' 'బిల్లా' 'కిక్' 'సన్నాఫ్‌ సత్యమూర్తి' 'వేదం' 'భరత్ అనే నేను' 'ఖైదీ నెం.150' సినిమాల్లోని క్లిప్పింగ్స్ తో ఈ పాటను ఎడిట్ చేశారు.

స్టార్ హీరోల స్టెప్పులతో చేసిన 'ఊ అంటావా' మగాళ్ల వెర్షన్‌ ఫన్ సాంగ్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ.. ''ఓ మై గాడ్. ఇది హిలేరియస్ గా ఉంది. మేము విడుదల చేసిన దాదాపు అన్ని భాషల్లోనూ 'ఊ అంటావా.. ఊఊ అంటావా' పాట వైరల్ అవుతోంది. అందరికీ ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. దీనికి చిత్ర బృందాన్ని కూడా ట్యాగ్ చేశారు.

కాగా, సుకుమార్ దర్శకత్వంలో బన్నీ - రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన ''పుష్ప'' పార్ట్-1 రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.