Begin typing your search above and press return to search.

చంద్రబాబు పాత్రను తగ్గించేశారా?

By:  Tupaki Desk   |   25 Oct 2018 3:46 PM IST
చంద్రబాబు పాత్రను తగ్గించేశారా?
X
నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ సొంత బేనర్లో నిర్మిస్తున్న ‘యన్.టి.ఆర్’ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదలుపెట్టిన ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసి రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని పోస్టర్లు బయటికి వచ్చాయి. అందులో చంద్రబాబు పాత్రలో రానాకు సంబంధించిన పోస్టర్లు కూడా చూశాం. ఒక దాంట్లో ఎన్టీఆర్.. చంద్రబాబు భుజం మీద చేయి వేసి మాట్లాడుతున్నట్లుగా ఉంది. అది చూశాక సినిమాలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుందో ఒక అంచనాకు వచ్చేశారు జనాలు. సాధారణంగా ఎన్టీఆర్-చంద్రబాబుల బంధం గురించి మాట్లాడాలంటే.. వెన్నుపోటు వ్యవహారం.. రామారావుకు బాబు చేసిన ద్రోహం గుర్తుకొస్తాయి.

ఐతే తన బావ చంద్రబాబును ఈ సినిమాలో నెగెటివ్ గా చూపించడానికి బాలయ్య సాహసిస్తాడని ఎవ్వరూ అనుకోవడం లేదు. పైగా సినిమాలో బాబు పాత్రను చాలా పాజిటివ్‌ గా చూపించి ఎలివేట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సందేహాలు కలుగుతున్నాయి. ఐతే బాబును మరీ హైలైట్ చేసినా.. ఎక్కువ సీన్లు పెట్టినా.. జనాల ఫీలింగ్ మరోలా ఉంటుందని భావించి.. ఈ పాత్రను తగ్గించే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రతికూల విషయాల్ని దాచిపెట్టేసి.. మరీ సానుకూలంగా బాబును చూపించడం వల్ల జరిగే మంచి కంటే చెడే ఎక్కువని భావించి ఈ పాత్రకు సంబంధించిన సీన్లలో కోత పెడుతున్నారట. నాదెండ్ల భాస్కరరావు.. ఎన్టీఆర్ ను గద్దె దించిన సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల్ని తీసుకుని బాబు ఢిల్లీకి వెళ్లిన ఉదంతాన్ని సినిమాలో చూపించనున్నారట. ఈ సన్నివేశాల్ని ఇటీవలే చిత్రీకరించారట. ఆ సమయంలో ఎన్టీఆర్ కు బాబు ఎంత అండగా ఉన్నది సినిమాలో చూపిస్తారట. ఐతే సినిమాలో ఇది మాత్రమే చూపిస్తే.. తర్వాత బాబే.. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల్ని ఉసిగొల్పి.. వాళ్లను ప్రలోభ పెట్టి పార్టీని.. అధికారాన్నిచేతుల్లోకి తీసుకున్న ఉదంతం సంగతేంటన్నది సందేహం.