Begin typing your search above and press return to search.

నందమూరి ఫ్యామిలీ నుండి మరోటి..!

By:  Tupaki Desk   |   26 May 2022 10:30 AM GMT
నందమూరి ఫ్యామిలీ నుండి మరోటి..!
X
నందమూరి ఫ్యామిలీ నుండి సీనియర్ ఎన్టీఆర్‌ తర్వాత చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. వారిలో బాలకృష్ణ మరియు జూ.ఎన్టీఆర్‌మాత్రమే స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. కళ్యాణ్ రామ్‌ చాలా కాలంగా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫ్యామిలీ నుండి పలువురు హీరోలు ఉన్నట్లుగానే పలు నిర్మాణ సంస్థలు కూడా ఉన్న విషయం తెల్సిందే.

కేవలం నందమూరి ఫ్యామిలీ లో మాత్రమే కాకుండా మంచు.. మెగా.. అక్కినేని ఫ్యామిలీల నుండి నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మంచు ఫ్యామిలీలో నాలుగు నిర్మాణ సంస్థలు ఉంటే.. మెగా ఫ్యామిలీకి రెండు మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇక అక్కినేని వారికి అన్నపూర్ణ స్టూడియోస్‌ తో పాటు మనం ఎంటర్ టైన్మెంట్స్ కూడా ఉంది. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో మరో బ్యానర్‌ వచ్చి చేరింది.

ఇప్పటికే నందమూరి ఫ్యామిలీకి మొదటగా రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌ ఉన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ ఆ బ్యానర్‌ ను మొదలు పెట్టి పలు సినిమాలను నిర్మించారు.

ఆ తర్వాత హరికృష్ణ కూడా నిర్మాతగా ప్రయత్నించారు. ఇక బాలయ్య ఎన్బీకే బ్యానర్‌ ను మొదలు పెట్టాడు. కళ్యాణ్ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్నాడు. జూ.ఎన్టీఆర్‌ కూడా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ లోనే సినిమాలు చేస్తున్నాడు.

ఇప్పుడు కొత్తగా బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో బ్యానర్‌ ను మొదలు పెట్టారు. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారం పేరు తో చివర్లో రామారావు పేరు కలిసే విధంగా బసవతారక రామ అనే పేరును బ్యానర్‌ కు ఖరారు చేశారు. ఈ బ్యానర్ లో ఎవరు సినిమా చేయబోతున్నారు... ఎవరు ఈ బ్యానర్‌ వెనుక ఉన్న విషయాలను ఈనెల 28వ తారీకున అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ప్రీ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.

మీడియా వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం నందమూరి ఫ్యామిలీకి చెందిన జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా ఈ బ్యానర్ లో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ నిర్మాణ సంస్థ ను ప్రారంభించబోతున్నది కూడా ఆయనే అనే వార్తలు వస్తున్నాయి. గతంలో చైతన్య కృష్ణ రెండు మూడు సినిమాల్లో నటించాడు.. కాని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కాస్త గ్యాప్‌ తీసుకుని సొంత బ్యానర్‌ తో ప్రయత్నం చేయబోతున్నాడు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవ్వబోతుంది అనేది చూడాలి.