Begin typing your search above and press return to search.

ప్రశాంత్ నీల్ కు పెద్ద మొత్తం అడ్వాన్స్ ఇచ్చిన మెగా నిర్మాత

By:  Tupaki Desk   |   18 March 2021 4:30 AM GMT
ప్రశాంత్ నీల్ కు పెద్ద మొత్తం అడ్వాన్స్ ఇచ్చిన మెగా నిర్మాత
X
కేజీఎఫ్‌ అనే ఒకే ఒక్క సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ఇండియాస్ మోస్ట్‌ క్రేజీ స్టార్ డైరెక్టర్‌ గా మారిపోయాడు. ఆయన ప్రస్తుతం చేస్తున్న కేజీఎఫ్‌ 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేజీఎఫ్‌ 2 విడుదల కాకుండానే ప్రభాస్ తో సలార్‌ ను ప్రారంభించాడు. వచ్చే ఏడాదిలో సలార్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఇప్పటికే షూటింగ్‌ ను మొదలు పెట్టాడు. సలార్‌ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ను మైత్రి మూవీస్‌ బ్యానర్‌ లో చేసేందుకు ఇప్పటికే ఒప్పందం అయినట్లుగా సమాచారం అందుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ మెగా నిర్మాత అల్లు అరవింద్ బుక్ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇటీవల గీతా ఆర్ట్స్‌ ఆఫీస్ కు ప్రశాంత్ నీల్‌ వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అల్లు అరవింద్ భారీ మొత్తంలో అడ్వాన్స్ ను ప్రశాంత్ నీల్‌ కు ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అల్లు అరవింద్‌ మరియు ప్రశాంత్ నీల్‌ ల మద్య మంచి రిలేషన్‌ ఉందని.. అందుకే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ లో ప్రశాంత్ నీల్ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నాడంటూ ఇటీవలే బన్నీ వాసు స్పష్టంగా చెప్పుకొచ్చాడు. ఆయన మాటలతో గీతా ఆర్ట్స్ లో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని క్లారిటీ వచ్చింది. అయితే అది బన్నీతోనేనా అనే విషయాన్ని ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కాని బన్నీతో ఆయన సినిమా చేయాలని అందరితో పాటు మేము కోరుకుంటున్నాం అన్నాడు. దాన్ని బట్టి ఖచ్చితంగా అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చింది అల్లు అర్జున్‌ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకే అయ్యి ఉంటుందని అంటున్నారు. బన్నీ.. ప్రశాంత్ నీల్ కాంబో కు కనీసం ఏడాదిన్నర నుండి రెండేళ్ల సమయం పట్టవచ్చు. కేజీఎఫ్‌ 2 విడుదల అవ్వాలి.. సలార్‌ పూర్తి అవ్వాలి.. ఎన్టీఆర్‌ తో మూవీ ప్రారంభం అయ్యి షూటింగ్ పూర్తి అవ్వాలి. అప్పటికి గాని బన్నీతో ప్రశాంత్‌ నీల్‌ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదంటున్నారు.