Begin typing your search above and press return to search.

బాబోయ్‌.. ఓంకార్‌ మళ్లీ వస్తున్నాడు

By:  Tupaki Desk   |   8 April 2015 7:30 PM GMT
బాబోయ్‌.. ఓంకార్‌ మళ్లీ వస్తున్నాడు
X
బుల్లితెర మీద ఓంకార్‌ బాబు చేసిన బీభత్సం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆట డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌తో అన్నయ్య అనిపించుకుంటూ మెగా స్టార్‌లా ఫీలైపోయి మనోడు వేసిన వేషాలు అన్నీ ఇన్నీ కావు. డ్యాన్సర్లు కాళ్ల మీద పడిపోవడాలు.. ఇతను ఆశీర్వదించడాలు.. కొందరికి వార్నింగులు ఇవ్వడాలు.. అరవడాలు.. కన్నీళ్లు పెట్టుకోవడాలు.. జడ్జీలతో ఫైటింగులు.. అబ్బో ఆ డ్రామా గురించి మాటల్లో వర్ణించడం కష్టం. ఆ అద్భుతాల్ని వీక్షించినవారికే ఓంకార్‌ గొప్పదనమేంటో తెలుస్తుంది. ఐతే మన ఓంకార్‌ బాబుకు ఆ మధ్య వెండితెర మీద కూడా మమకారం పుట్టి.. మెగా ఫోన్‌ పట్టాడు.

కానీ హవీష్‌ బాబును హీరోగా పెట్టి మనోడు తీసిన 'జీనియస్‌' జనాల్ని బెంబేలెత్తించింది. బుల్లితెర మీద ఉడికినట్లు వెండితెరపై ఓంకార్‌ పప్పులుడకలేదు. దీంతో మళ్లీ మెగా ఫోన్‌ పట్టే సాహసం చేయలేదీ క్రియేటివ్‌ డైరెక్టర్‌. ఐతే అంతటితో కథ ముగిసిపోయిందనుకున్నారంతా. కానీ ఓంకార్‌ మళ్లీ వెండితెరమీదికి దాడికి వస్తున్నాడు. రవిబాబు బ్రాండ్‌ హీరోయిన్‌ పూర్ణతో ఓ హార్రర్‌ సినిమా చేయడానికి మనోడు సన్నాహాలు చేసుకుంటున్నాడు. స్క్రిప్టు ఓకే అయిపోయిందట. నిర్మాత ఎవరో తెలియదు కానీ.. త్వరలోనే సినిమా మొదలు కాబోతోందట. ఇందులో పూర్ణ డబుల్‌ రోల్‌ చేయబోతుండటం విశేషం. చూద్దాం.. ఈసారి ఓంకార్‌ ఎలాంటి బీభత్సం చేస్తాడో?