Begin typing your search above and press return to search.

ప్రఖ్యాత నటుడు ఓంపురి ఇక లేరు

By:  Tupaki Desk   |   6 Jan 2017 4:38 AM GMT
ప్రఖ్యాత నటుడు ఓంపురి ఇక లేరు
X
ప్రఖ్యాత నటుడు ఓంపురి ఇక లేరు. సినీ లోకానికి విస్మయానికి గురి చేస్తూ ఆయన తన దారిన తాను అనంత లోకాలకు వెళ్లిపోయారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా నటించే అతి కొద్దిమందిలో ఓంపురి ఒకరు. భాషలకు అతీతంగా.. ప్రాంతాల పరిధులు దాటి సినీ అభిమానులు ఆయన్ను అభిమానిస్తుంటారు. నాటకరంగంతో పాటు.. సినిమా రంగంలో తనకు తానే సాటి అనిపించే సత్తా ఉన్న అతి కొద్ది నటుల్లో ఆయన ఒకరు.

66 ఏళ్ల ఓంపురి.. ముంబయిలోని తన స్వగృహంలో ఈ ఉదయం మరణించారు. ఆయన మరణంపై బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఓంపురి మరణం తనను షాకింగ్ కు గురి చేసిందని.. ఆయన మరణించారంటే నమ్మబుద్ధి కావటం లేదని పేర్కొన్నారు. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఉన్న ఆయన.. ఇక లేరన్నది జీర్ణించుకోలేనట్లుగా ఉందన్న ఆయన.. ఓంపురి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

1950 అక్టోబరు 18న హర్యానాలోని అంబాలా ప్రాంతంలో ఒక పంజాబీ కుటుంబంలో జన్మించిన ఓంపురి.. పుణెలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1976లో మరాఠీ చిత్రం ఘాశీరామ్ కొత్వాల్ తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. పలుమార్లు జాతీయఉత్తమ నటుడి అవార్డును పొందారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు.తెలుగులో ఆయన అంకురం చిత్రంలో నటించారు. ఎనిమిదిసార్లు ఫిలింఫేర్ అవార్డులతో పాటు.. మరెన్నో పురస్కారాల్ని సాధించిన నటుడిగా ఆయన్ను చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/