Begin typing your search above and press return to search.

తిరుమలను మళ్లీ ఎలా కట్టేశారంటే..

By:  Tupaki Desk   |   13 Feb 2017 10:30 AM GMT
తిరుమలను మళ్లీ ఎలా కట్టేశారంటే..
X
పీరియాడికల్ చిత్రాలతో.. వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఆధారిత సినిమాలు తీయడంలో ఎదురయ్యే ప్రధాన సమస్య లొకేషన్స్. అన్ని వందల ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఆనవాళ్లు కూడా అంతగా లభించవు. తాజాగా విడుదల అయిన నాగార్జున మూవీ ఓం నమో వేంకటేశాయకు కూడా ఇదే సమస్య ఎదుర్కున్నామని చెబుతున్నాడు ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్.

తిరుమల గర్భగుడి సెట్ ను ఎక్కడైనా వేయచ్చన్న ఆయన.. గోపుర ప్రాంగణం.. తిరు వీధుల విషయంలో మాత్రం లొకేషన్ కోసం ఇబ్బంది ఎదుర్కున్నట్లు చెప్పాడు. చాలాప్రాంతాలు తిరిగిన తర్వాత చివరకు రామోజీ ఫిలింసిటీ అనువుగా ఉంటుందని భావించి.. అక్కడే కేవలం ఆరు రోజుల్లోనే గోపురం సహా గుడి ప్రాంగణాన్ని నిర్మించేశారట. ఈ సమయంలోనే రెండు వెయ్యి కాళ్ల మండపాలు.. గోపురం.. ప్రాకార మండపం.. పురవీధులు కూడా నిర్మించామని చెప్పాడు. ఐదొందల ఏళ్ల క్రితం గోపురం.. ఆ ప్రాంతం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు టీటీడీ లైబ్రరీ సహా అనేక రిఫరెన్సులను చూసుకున్నారట.

అప్పటి కాలాన్ని ప్రతిబింబించేందుకు చెక్క.. ఫైబర్.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను మాత్రమే ఉపయోగించామని చెప్పాడు ఆర్ట్ డైరెక్టర్. ఓం నమో వేంకటేశాయ కోసం.. మొత్తం 25 సెట్స్ వేశామని.. అన్నిటిలోను గోపురం ప్రాకారం బాగా నచ్చిందన్నారు కిరణ్ కుమార్. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా పాట కోసం.. మహాబలేశ్వరంలో పది ఎకరాల్లో పూల తోట పెంచారట. ఆ పాటలో ఉపయోగించిన పూలలో కొన్ని మినహాయిస్తే.. అన్నీ నిజమైనవే కావడం విశేషం. ప్రతీ రోజూ 8 లోడ్లు పూలు తెప్పించి ఆ పాట తీయబట్టే.. అంత గొప్పగా ఆ సాంగ్ వచ్చిందంటున్నాడు కళా దర్శకుడు కిరణ్ కుమార్.