Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఓం నమో వెంకటేశాయ

By:  Tupaki Desk   |   10 Feb 2017 9:50 AM GMT
మూవీ రివ్యూ : ఓం నమో వెంకటేశాయ
X
చిత్రం: ‘ఓం నమో వెంకటేశాయ’

నటీనటులు: అక్కినేని నాగార్జున - సౌరభ్ జైన్ - సాయికుమార్ - జగపతిబాబు - అనుష్క- ప్రగ్యా జైశ్వాల్ - విమలా రామన్ - సంపత్ - రావు రమేష్ - వెన్నెల కిషోర్ - రఘుబాబు - బ్రహ్మానందం - పృథ్వీ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి
రచన: జె.కె.భారవి
నిర్మాత: మహేష్ రెడ్డి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు

దాదాపు రెండు దశాబ్దాల కిందట కె.రాఘవేంద్రరావు-అక్కినేని నాగార్జున కలిసి ‘అన్నమయ్య’తో చేసిన మ్యాజిక్ ను తెలుగు ప్రేక్షకులెవ్వరూ మరిచిపోలేరు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో శ్రీరామదాసు.. షిరిడి సాయి లాంటి ఆధ్యాత్మిక చిత్రాలొచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఈ జోడీ ‘ఓం నమో వెంకటేశాయ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. వేంకటేశ్వరుడి మరో పరమ భక్తుడు హాథీరాం బాబా జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వేద పాఠశాలలో విద్యనభ్యసించే రామ (అక్కినేని నాగార్జున) చిన్నతనంలోనే దేవుడిని చూడాలని కోరుకుంటాడు. గురువు సూచన మేరకు తపస్సు మొదలుపెడతాడు. ఆ తపస్సులోనే పెరిగి పెద్దవాడవుతాడు. అతడి తపస్సు ఫలించి దేవుడు బాలుడి రూపంలో వచ్చి పలకరించినా.. రామ పట్టించుకోడు. ఆ బాలుడే దేవుడని తెలియక తిరిగి పంపించేస్తాడు. తపోభంగమయ్యాక ఇంటికి చేరిన రామకు మరదలు భవాని (ప్రగ్యా జైశ్వాల్)ని ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ దేవుడికే తన జీవితం అంకితమంటూ తిరుమలకు పయనమవుతాడు రామ. ఐతే అక్కడ అతడికి దైవ దర్శనం జరగదు. అనేక ఆటంకాలు ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని రామ.. శ్రీనివాసుని దర్శనం ఎలా చేసుకున్నాడు.. దేవుడు ప్రత్యక్షమయ్యాక రామ ఏం చేశాడు.. ఈ లోపు తిరుమలలో జరిగే అకృత్యాలకు అడ్డు కట్ట వేసి దాన్ని పరమ పవిత్రమైన క్షేత్రంగా రామ ఎలా తీర్చిదిద్దాడు.. చివరగా రామ జీవితానికి ముగింపు ఏంటి.. ఇవన్నీ తెర మీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

ఈ రోజుల్లో భక్తి సినిమాలు ఎవరు చూస్తారు.. అందులోనూ భక్తుడిగా నాగార్జున అంటే ఇంకా కష్టం.. అని సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లందరికీ తిరుగులేని సమాధానం చెప్పింది ‘అన్నమయ్య’. ఆ సినిమా ఎలాంటి ముద్ర వేసిందో.. తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా రంజింపజేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేయడమంటే మాటలు కాదు. ‘శ్రీరామదాసు’తో కొంత వరకు ఆ పని చేయగలిగిన రాఘవేంద్రరావు-నాగార్జున జోడీ ‘షిరిడి సాయి’ విషయంలో దెబ్బ తింది. ఇప్పుడు మళ్లీ వేంకటేశ్వరుడు-భక్తుడు-తిరుమల నేపథ్యంలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో చాలా సందేహాలు రేకెత్తాయి. మళ్లీ తిరుమల గురించి ఏం చూపిస్తారు.. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేని ఉత్తర భారతీయుడు హాథీరాం బాబా గురించి ఏం చెబుతారు.. ఈ కథతో ఎలా మెప్పిస్తారు అంటూ రకరకాల అనుమానాలు రేకెత్తాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలే ఇస్తుంది ‘ఓం నమో వేంకటేశాయ’.

‘అన్నమయ్య’ లాంటి అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయి. అలాంటి అద్భుతాలు పునరావృతం కావు. కాబట్టి ముందు ‘ఓం నమో వేంకటేశాయ’ను అన్నమయ్యతో పోల్చి చూడకూడదు. దీని ప్రత్యేకత వేరు. ఇందులో చూపించిన అంశాలు వేరు. అలాగే దేవుడికి.. భక్తుడికి మధ్య బంధం అంటేనే కల్పన కాబట్టి ‘ఓం నమో వేంకటేశాయ’లో చూపించేదాంట్లో వాస్తవమెంత అన్న సందేహాల జోలికి కూడా పోకూడదు. ఈ రెండు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఓపెన్ మైండ్ తో చూస్తే ‘ఓం నమో వేంకటేశాయ’ కూడా ప్రత్యేకమైన సినిమాలాగే అనిపిస్తుంది.

తిరుమలలో ముందు వరాహమూర్తిని ఎందుకు దర్శించుకోవాలని చెబుతారు.. కొండపై ఉచిత అన్నదానం.. కళ్యాణ కట్ట ఎలా మొదలయ్యాయి.. తిరుమలలో పూలతోటల ప్రాశస్త్యమేంటి.. శ్రీవారి ఉత్తరీయం ప్రత్యేకతేంటి.. శ్రీవారి కళ్యాణం ప్రతి రోజూ ఎందుకు జరుగుతుంది.. ఇలాంటి ఎన్నెన్నో విషయాల్ని ఏదో కథ లాగా కాకుండా ఆసక్తికరమైన సన్నివేశాల ద్వారా చెప్పడంలో ‘ఓం నమో వేంకటేశాయ’ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక మన జనాలకు పెద్దగా పరిచయం లేని హాథీరాం బాబా చరిత్రను కూడా ఆసక్తికర రీతిలో చెప్పాడు రాఘవేంద్రరావు. హాథీరాం బాబా గొప్పదనాన్ని కొంచెం ఎక్కువ చేసి చూపినట్లు.. తిరుమలకు సంబంధించి ప్రతి మంచి విషయాన్నీ ఆయనకే ఆపాదించేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ.. కథలో కొంత కల్పన ఉందని ముందే చెప్పారు కాబట్టి మన్నించవచ్చు.

అన్నమయ్య.. శ్రీరామదాసు స్థాయిలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం ‘ఓం నమో వేంకటేశాయ’కు ప్రతికూలతే కానీ.. ‘షిరిడి సాయి’లో మాదిరి ఇందులో సమయం భారంగా అయితే గడవదు. ఇందులో కథంటూ పెద్దగా ఏమీ లేకపోయినా.. రైటింగ్ పార్ట్ కొంచెం వీకే అయినా.. దృశ్యాలతో కనువిందు చేయడంలో రాఘవేంద్రరావు బృందం విజయవంతమైంది. లొకేషన్లు.. సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ పడకుండా బాగా ఖర్చు పెట్టడం.. పాత్రలకు తగ్గ నటీనటులను ఎంచుకుని వారి నుంచి చక్కటి అభినయం రాబట్టుకోవడం.. ముఖ్యంగా దేవుడికి.. భక్తుడికి మధ్య సన్నివేశాలన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడంతో ‘ఓం నమో వేంకటేశాయ’ ప్రేక్షకుల్ని రంజింపజేస్తుంది.

ప్రథమార్ధంలో కొంచెం సాదాసీదాగా అనిపించినా.. ద్వితీయార్ధంలో వేంకటేశ్వరుడు హాథీరాం బాబాకు దర్శన భాగ్యాన్ని కల్పించే దగ్గర్నుంచి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది ‘ఓం నమో వేంకటేశాయ’. దేవుడు.. భక్తుడు పాచికలు ఆడటం ఇందులో అత్యంత ఆసక్తికర అంశం. హాథీరాం వేంకటేశ్వరుడి కళ్యాణం స్వయంగా జరిపించడం.. దేవుడు పందెంలో ఓడి నగలు కోల్పోతే హాథీరాం కారాగారంలో పడటం.. ఇలాంటి ఘట్టాలన్నీ మెప్పిస్తాయి. ఇక పతాక సన్నివేశాలైతే చెప్పనవసరం లేదు. ఓ దశ వరకు భక్తి భావం కలిగించడంలో విఫలమైన రాఘవేంద్రరావు.. చివరికి వచ్చేసరికి ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచేస్తాడు. ‘ఓం నమో వేంకటేశాయ’ కూడా ‘అన్నమయ్య’.. ‘శ్రీరామదాసు’ల స్థాయిని అందుకునేది పతాక సన్నివేశంలోనే. అన్ని విభాగాలూ పతాక స్థాయిని అందుకున్న క్లైమాక్స్ చూశాక ప్రేక్షకుల్లో ఒక డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓవరాల్ గా ‘ఓం నమో వేంకటేశాయ’ ప్రేక్షకులపై మంచి ఇంప్రెషనే వేస్తుంది.

నటీనటులు:

నాగార్జున మరోసారి భక్తుడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ‘ఓం నమో వెంకటేశాయ’లో ఎమోషన్ కొంత తగ్గినా ఈ చిత్రంలో ప్రేక్షకుల్ని లీనం చేసేది నాగార్జున నటనే. నిజమైన భక్తుడి తరహాలో ఆ పాత్రలో నాగ్ లీనమైపోయిన తీరు అబ్బుర పరుస్తుంది. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాల్లో నాగ్ నటన కొంచెం ఎగుడుదిగుడుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో మాత్రం నాగ్ అద్భుతంగా నటించాడు. ప్రతి సన్నివేశంలోనూ ఆయన పరిణతి కనిపిస్తుంది. వేంకటేశ్వర కళ్యాణం జరిపించే దగ్గర్నుంచి నాగ్ నటన అసామాన్యంగా సాగుతుంది. పతాక సన్నివేశంలోనూ నాగ్ అద్భుతంగా చేశాడు. నాగ్ కెరీర్లో హాథీరాం బాబా పాత్ర కూడా ఎప్పటికీ నిలిచిపోయేదే.

వేంకటేశ్వరుడిగా సౌరభ్ జైన్ కూడా చాలా బాగా కుదిరాడు. ఇప్పటిదాకా వేంకటేశ్వరుడి పాత్రలు పోషించిన వాళ్లలో లుక్ పరంగా సౌరభ్ ‘ది బెస్ట్’ అని చెప్పొచ్చు. అతడి ఆహార్యం ఈ పాత్రకు అంత బాగా సరిపోయింది. నటన పరంగా సౌరభ్ కు యావరేజ్ మార్కులు పడతాయి. అనుష్క కృష్ణమ్మగా బాగా చేసింది. ఆమె పాత్ర సినిమాకు ప్లస్ అయింది. ప్రగ్యాది పరిమితమైన పాత్ర. నిడివి పావుగంట కూడా లేదు. రాఘవేంద్రుడి స్టయిల్లో సాగే పాటలో అందాల విందు చేసి కనుమరుగైపోతుంది. జగపతిబాబు కూడా ఇలా మెరిసి అలా మాయమవుతాడు. వేంకటేశ్వరుడి భార్యలుగా విమలా రామన్.. అస్మిత ఓకే. రావు రమేష్ ఇలాంటి సినిమాలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నెగెటివ్ రోల్ లో మెప్పించాడు. చిత్తూరు యాసలో డైలాగులు అదరగొట్టాడు. సాయికుమార్.. సంపత్ రాజ్.. రఘుబాబు.. వెన్నెల కిషోర్ కూడా ఓకే. బ్రహ్మానందంది చాలా చిన్న పాత్ర.

సాంకేతికవర్గం:

కీరవాణి ‘ఓం నమో వెంకటేశాయ’కు ప్రధాన బలం. ‘అన్నమయ్య’తో పోల్చి చూస్తే ఫీలింగ్ వేరుగా అనిపించొచ్చు కానీ.. ‘ఓం నమో వెంకటేశాయ’కు కూడా తన సంగీతంతో బలంగా నిలిచాడు కీరవాణి. ఆయన పాటలన్నీ సినిమాకు తగ్గట్లుగా చక్కగా కుదిరాయి. సినిమాలో బాగా ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అని కీరవాణి మరోసారి అనిపించాడు. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా సినిమాకు చక్కగా సరిపోయింది. తిరుమలలో షూటింగ్ చేయకున్నా.. కథ అక్కడే జరుగుతున్న భావన కలిగించేలా విజువల్స్ ద్వారా కట్టిపడేశారు. లొకేషన్ల ఎంపిక.. ఆర్ట్ వర్క్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సినిమా అంతటా కూడా సెట్టింగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా బడ్జెట్లో చూసుకుంటే ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు అవసరమైనంత ఖర్చు పెట్టారు. రాజీ పడలేదు.

రచయితగా భారవి నుంచి అన్నమయ్య.. శ్రీరామదాసు స్థాయి కనిపించలేదు కానీ.. పెద్దగా సమాచారం లేని హాథీరాం కథకు కొంచెం కల్పన జోడించి ఉన్నంతలో స్క్రిప్టును పర్వాలేదనిపించాడు. కానీ పైన చెప్పుకున్న రెండు సినిమాల్లో ఉన్నంత ఎమోషనల్ డెప్త్ ఇందులో లేదు. డైలాగులు బాగున్నాయి. ఇక దర్శకుడు రాఘవేంద్రరావు ఆధ్యాత్మిక చిత్రాలు తీయడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని.. హాథీరాం బాబా కథను ఆసక్తికరంగానే తీర్చిదిద్దాడు. పతాక సన్నివేశాల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలో ఒక దశ వరకు డివైన్ ఫీలింగ్ తీసుకురాలేకపోయిన రాఘవేంద్రుడు.. సినిమా చివరికి వచ్చేసరికి ఆ భావన కలిగిస్తాడు. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుడు మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. ‘షిరిడి సాయి’ సినిమా విషయంలో పట్టు కోల్పోయినట్లు కనిపించిన దర్శకేంద్రుడు.. ఈసారి మళ్లీ తనేంటో చూపించాడు.

చివరగా: ఓం నమో వెంకటేశాయ.. మళ్లీ రాఘవేంద్రరావు-నాగ్ మాయ

రేటింగ్- 3.25/5


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre