Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ :'ఒక్కడు మిగిలాడు’

By:  Tupaki Desk   |   10 Nov 2017 9:10 AM GMT
మూవీ రివ్యూ :ఒక్కడు మిగిలాడు’
X
చిత్రం : 'ఒక్కడు మిగిలాడు’

నటీనటులు: మంచు మనోజ్ - అజయ్ నూతక్కి - అనీషా ఆంబ్రోస్ - జెన్నిఫర్ - మిలింద్ గుణాజీ - మురళీ మోహన్ - సుహాసిని - పోసాని కృష్ణమురళి - బెనర్జీ తదితరులు
సంగీతం: శివ నందిగాం
ఛాయాగ్రహణం: రామరాజు
నిర్మాతలు: ఎస్ ఎన్ రెడ్డి - లక్ష్మీకాంత్
రచన - దర్శకత్వం: అజయ్ నూతక్కి

శౌర్య.. ఎటాక్.. గుంటూరోడు సినిమాలతో వరుసగా ఎదురు దెబ్బలు తిన్న మంచు మనోజ్.. ఇప్పుడు ‘ఒక్కడు మిగిలాడు’తో వచ్చాడు. శ్రీలంకలో తమిళుల పోరాటం నేపథ్యంలో అజయ్ ఆండ్రూస్ నూతక్కి రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో ఏం ప్రత్యేకతలున్నాయో చూద్దాం పదండి.

కథ:

సూర్య (మంచు మనోజ్) శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థుల్లో ఒకడు. అతను యూనివర్శిటీలో పీజీ చేస్తుంటాడు. ఆ యూనివర్శిటీలో ఓ ప్రొఫెసర్.. మంత్రి కొడుకులైన ఇద్దరు కుర్రాళ్ల వల్ల ముగ్గురు అమ్మాయిల ప్రాణాలు పోతాయి. అందులో ఇద్దరు శరణార్థులు కుూడా ఉంటారు. వీరి కోసం సూర్య పోరాటం మొదలుపెడతాడు. దీంతో అతడిని పోలీసులు హింసించడం మొదలుపెడతారు. తనకు సాయం చేయడానికి వచ్చిన ఒక పోలీస్ వద్ద అసలు తన కథేంటో.. నేపథ్యమేంటో.. తాను పసివాడిగా ఎలాంటి పరిస్థితుల్లో శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చాడో చెప్పడం మొదలుపెడతాడు. ఆ కథేంటి.. ఇక వర్తమానంలో అతడి పోరాటం ఎంతవరకు వచ్చింది.. దానికి ఫలితం దక్కిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

సినిమా అనేది వినోద ప్రధానంగా ఉండాలంటారు చాలామంది. అలాగని అందులో వేరే ఎమోషన్లు ఉండొద్దని కాదు. అవసరానికి తగ్గట్లు యాక్షన్ చూపించొచ్చు. సెంటిమెంటూ పండించొచ్చు. కానీ ఏవైనా కథలో మిళితమై ఉండాలి. ప్రేక్షకుడికి కనెక్టవ్వాలి. వీటిలో ఏది డోస్ ఎక్కువైనా కష్టమే. కానీ ‘ఒక్కడు మిగిలాడు’లో ఈ రెండూ హద్దులు దాటిపోయాయి. ఈ సినిమాలో ఉన్నదల్లా యాక్షన్ అండ్ సెంటిమెంటే. దర్శకుడు అజయ్ నూతక్కి ఉద్దేశాలు మంచివే కావచ్చు. అతను ఒక జాతి పోరాటాన్ని.. వారి కష్టాల్ని చూపించాలని అనుకున్నాడు. కానీ అతను ఈ విషయాల్ని లోతుగా చూపించడంలో విజయవంతం కాలేకపోయాడు.

పోరాటం పేరుతో కాల్పుల మోత తప్ప ఇంకేం చూపించలేదు దర్శకుడు. ఇక వాళ్ల దీన గాథల్ని చూపించడానికి దయనీయంగా సాగే ఓ సముద్ర ప్రయాణాన్ని కథావస్తువుగా తీసుకుకున్నాడు. ఇక్కడ అతను ఒక పరిధిని దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. ఓవర్ డోస్ సెంటిమెంటుతో ఇబ్బందికర స్థాయికి సినిమాను తీసుకెళ్లాడు. ఇందులో కొన్ని చోట్ల హృదయం ద్రవించినప్పటికీ.. ఈ బాధను ఎక్కువసేపు తట్టుకోవడం కష్టమై ఈ ప్రయాణం ఇంకెప్పుడు ముగుస్తుందా అనిపించే స్థాయికి దాన్ని సాగదీశారు. కనీసం ఎడిటింగ్ దగ్గర అయినా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సింది.

శ్రీలంకలో తమిళుల పోరాటానికి సంబంధించి తమిళంలో ఇంతకుముందే కొన్ని సినిమాలొచ్చాయి. అందులో మణిరత్నం తీసిన ‘అమృత’ కూడా ఒకటి. అందులో మణిరత్నం మరీ లోతుగా ఏమీ శ్రీలంక తమిళుల బాధల్ని.. పోరాటాన్ని చూపించలేదు. కానీ కొన్ని సన్నివేశాలతోనే ఎంతో హృద్యంగా.. హృదయాల్ని మెలిపెట్టేలా చేయగలిగాడు మణిరత్నం. ప్రేక్షకుల్లో కదలిక తేవడానికి ఒక చిన్న సన్నివేశం కూడా చాలనడానికి ఆ సినిమా ఒక ఉదాహరణ. కానీ ఇక్కడ అజయ్ నూతక్కి రెండుగంటల సినిమాతో కూడా ఆ ఎమోషన్ తీసుకురాలేకపోయాడు. శ్రీలంక నేపథ్యంలో సాగే ప్రథమార్ధంలో అసలు సమస్యను పెద్దగా చర్చించింది లేదు. అక్కడి తమిళుల పరిస్థితిని లోతుగా చూపించిందేమీ లేదు. కేవలం శ్రీలంక సైన్యం వారిపై కాల్పులు జరపడం.. తమిళ టైగర్లు వారిని ఎదుర్కోవడం.. ఇలా కాల్పుల మోతతో సాగే యాక్షన్ ఎపిసోడ్లు తప్ప ఇంకేమీ లేవు.

ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ స్ఫూర్తితో తీర్చిదిద్దుకున్న పీటర్ పాత్ర కూడా నిరాశ పరుస్తుంది. ఎల్టీటీఈ లీడర్ అంటే అనుక్షణం ఆవేశంతో ఊగిపోవాలి అన్నట్లుగా ఆ పాత్రను తయారు చేశారు. మనోజ్ కూడా అలాగే నటించాడు. ఆ పాత్ర ఆరంభం నుంచి చివరిదాకా చాలా ‘అతి’గా ప్రవర్తిస్తూ ఉంటుంది. అతిగా ఆవేశ పడుతూ డైలాగులు పేలుస్తుంటుంది. నాయకత్వం.. పోరాటం అంటే వీర లెవెల్లో డైలాగులు పేల్చడం.. తుపాకులు పట్టి బుల్లెట్లు పేల్చడం మాత్రమే అన్నట్లుగా ఉంది ఇందులో వ్యవహారం చూస్తే. ఇలా చూపించడం ద్వారా ఆ పాత్ర స్థాయినే తగ్గించేశారు. శ్రీలంక ఎపిసోడ్ చివర్లో కొంచెం ఎమోషన్ తీసుకురాగలిగారు. చివరగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగుంది.

ఇక ద్వితీయార్ధంలో సముద్ర ప్రయాణం నేపథ్యంలో సాగే ఎపిసోడ్ సినిమాకు కీలకం. పడవలోని మనుషుల కష్టాలు చూసి కొన్ని చోట్ల హృదయం ద్రవించే మాట వాస్తవం. కానీ మరీ 45 నిమిషాల పాటు ఈ కష్టాల్ని చూపిస్తే ఎలా తట్టుకోగలం? ఇందులో అడ్వెంచర్ ఫ్యాక్టర్ కూడా ఏమీ లేదు మరి. కేవలం సెంటిమెంటు మీదే దృష్టిపెట్టేసరికి అది ఒక దశ దాటాక భరించడం కష్టమవుతుంది. తెరమీద పాత్రలు తీరం కోసం ఎదురు చూసినట్లుగా.. ప్రేక్షకుడు ఈ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందా అని డెస్పరేట్ గా ఎదురు చూసే పరిస్థితి వచ్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇలా యాక్షన్.. సెంటిమెంటుతో నిండిపోగా.. వర్తమానంలో సాగే కథలో ఏ ప్రత్యేకతా లేకపోయింది. ఆరంభం నుంచి చివరి దాకా చూసుకుంటే వర్తమానంలో సాగే కథ మహా అయితే అరగంట ఉంటుంది. దీంతో ఉన్నంతలో ఫ్లాష్ బ్యాక్ లోనే అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ మాత్రమే కోరుకుంటే ప్రథమార్ధం కొంతమేర.. ఓవర్ డోస్ సెంటిమెంటును తట్టుకోగలిగితే ద్వితీయార్ధం కొంత వరకు ఎంగేజ్ చేస్తుంది. ఐతే సగటు ప్రేక్షకుడికి ఇవి ఎంత వరకు రుచిస్తాయన్నది సందేహమే.

నటీనటులు:

మంచు మనోజ్ కాస్త ఎమోషనల్ గా నటిస్తూ ఆకట్టుకున్నప్పటికీ.. అతను బేస్ వాయిస్ తో డైలాగులు చెబుతుంటే ఒక్కోసారి ఇబ్బందిగా అనిపించింది. ప్రభాకరన్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన పీటర్ పాత్రలో కొన్ని చోట్ల డోస్ ఎక్కువైపోయినా.. మెప్పించాడులే. ఇక సూర్య పాత్రలో కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనిపించాడు. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ గురించి చెప్పడానికేమీ లేదు. సినిమాలో అందరికంటే బాగా నటించిందంటే.. విక్టర్ అనే కీలక పాత్ర చేసిన దర్శకుడు అజయ్ నూతక్కి అనే చెప్పాలి. అతను పాత్రకు తగ్గట్లుగా పరిణతితో నటించి మెప్పించాడు. అతడికి జోడీగా నటించిన జెన్నిఫర్ కూడా ఆకట్టుకుంటుంది. పడవ ప్రయాణికుల్లో ఒకడిగా కుమరన్ పాత్రలో కనిపించిన నటుడు బాగా చేశాడు. మిలింద్ గుణాజీ.. పోసాని కృష్ణ మురళి పర్వాలేదు. మురళీ మోహన్.. సుహాసిని మామూలే.

సాంకేతికవర్గం:

శివ నందిగాం సంగీతం బాగానే సాగింది. అతడి నేపథ్య సంగీతం కొన్ని చోట్ల టచ్ చేస్తుంది. ఇందులో పెద్ద పాటలేమీ లేవు. అన్నీ బిట్ సాంగ్సే. వాటిని కూడా హృద్యంగానే మలిచే ప్రయత్నం చేశాడు. రామరాజు ఛాయాగ్రహణం పర్వాలేదు. కెమెరామన్ కష్టం కనిపిస్తుంది. బడ్జెట్ పరిమితుల వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కొంచెం రాజీ పడ్డ విషయం అక్కడక్కడా కనిపిస్తుంది. సముద్ర ప్రయాణానికి సంబంధించిన సన్నివేశాల్లో కష్టం కనిపిస్తుంది కానీ.. క్వాలిటీ అక్కడక్కడా దెబ్బ తింది. రైటర్ కమ్ డైరెక్టర్ అజయ్ నూతక్కికి శ్రీలంకలో తమిళుల పోరాటంతో ఎమోషనల్ గా బాగా కనెక్టయినట్లున్నాడు. అతడి తొలి సినిమా కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిందే. ఐతే అతడి ఉద్దేశాలు మంచివే అని సినిమాలో అక్కడక్కడా తెలుస్తున్నప్పటికీ ఏ విషయంలోనూ ఒక మీటర్ పాటించకపోవడం.. లోతుగా సమస్యను చూపించలేకపోవడంతో ‘ఒక్కడు మిగిలాడు’ జనరంజకంగా తయారు కాలేకపోయింది.

చివరగా: ఒక్కడు మిగిలాడు.. యాక్షన్-సెంటిమెంట్ ఓవర్ లోడెడ్!

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre