Begin typing your search above and press return to search.

రూటు మార్చిన ఓంకార్?

By:  Tupaki Desk   |   12 Feb 2018 5:39 AM GMT
రూటు మార్చిన ఓంకార్?
X
'ఆట' అనే ఒక డాన్స్ రియాలిటీ షో ద్వారా ఛానల్ రేటింగ్స్ ని ఏ స్థాయికి తీసుకెళ్లవచ్చో నిరూపించిన యాంకర్ గా ఓంకార్ పేరు చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఒక విప్లవంగా మార్చిన ఘనత కూడా అతనికే దక్కుతుంది. నాటకీయత ఎక్కువయ్యేది అనే కామెంట్స్ విన్పించినప్పటికీ ఓంకార్ మాత్రం పెద్ద పేరే సంపాదించుకున్నాడు. ఆ ట్రెండ్ అలాగే కొనసాగింది కాని ఓంకార్ మాత్రం తన లైఫ్ టార్గెట్ అయిన సినిమాల వైపు వచ్చేసి దర్శకత్వం ద్వారా తన అసలు టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసే పనిలో పడ్డాడు. గత ఏడాది వచ్చిన రాజు గారి గది 2 మేకింగ్ పరంగా ఓంకార్ కు మంచి పేరు తీసుకొచ్చింది. మొదటి భాగం అంత మేజిక్ చేయలేకపోయినా తనలో మంచి టెక్నీషియన్ ఉన్నాడని మాత్రం ఓంకార్ మరోసారి ప్రూవ్ చేసాడు.

దీని తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓంకార్ ఒక మూవీ ప్లాన్ చేసినట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. కాని అది ఇంకా కార్యరూపం దాల్చడానికి టైం పట్టే అవకాశాలు ఉండటంతో ఈ లోపు స్టార్ మా ఛానల్ కోసం ఓంకార్ త్వరలో ఒక రియాలిటీ షో చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇది అఫీషియల్ గా బయటికి వచ్చిన న్యూస్ కానప్పటికీ ఓంకార్ కున్న పేరు దృష్ట్యా ఈ షో మంచి సక్సెస్ అవుతుంది అనే అంచనాలో ఉందట సదరు ఛానల్. అది దేనికి సంబంధించింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ రకంగా చూసుకుంటే ఓంకార్ తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరకు కం బ్యాక్ ఎంట్రీ ఇచ్చినట్టే. దీని తర్వాత సినిమాలు చేయడని కాదు కాని కొత్త సినిమా మొదలు పెట్టె లోపు ఒక సీజన్ పూర్తి చేయవచ్చు అనేది ఓంకార్ ప్లాన్ లా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ - రానా లాంటి స్టార్స్ ఏరికోరి మరీ టీవీ షోలు చేస్తుంటే తన ప్రస్థానంలో కీలక మజిలీగా నిలిచిన బుల్లితెరకు ఓంకార్ తిరిగి రావడంలో ఆశ్చర్యం ఏమి లేదు.