Begin typing your search above and press return to search.

ఇదే చివరిసారి అంటూ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ భావోద్వేగం..!

By:  Tupaki Desk   |   10 Dec 2021 9:00 PM IST
ఇదే చివరిసారి అంటూ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ భావోద్వేగం..!
X
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ - దివంగత కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మధ్య ప్రత్యేకమైన స్నేహబంధం ఉండేదనే సంగతి తెలిసిందే. ఈ సాన్నిహిత్యంతోనే పునీత్ నటించిన 'చక్రవ్యూహ' సినిమా కోసం తారక్ 'గెలయా గెలయా' అనే పాట పాడారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో అభిమానమని పునీత్ చెబుతుండేవారు. అందుకే కన్నడ పవర్ స్టార్ మృతి చెందడంతో తారక్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇప్పుడు తాజాగా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' ప్రెస్‌ మీట్‌ లో పునీత్ ని గుర్తు చేసుకొని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

'RRR' కన్నడ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో శుక్రవారం బెంగళూరులో చిత్ర బృందం ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో ఎన్టీఆర్‌ తో పాటు మరో హీరో రామ్ చరణ్ - దర్శకుడు రాజమౌళి - హీరోయిన్ అలియా భట్‌ - నిర్మాత డీవీవీ దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మీ మిత్రుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణం గురించి ఏమైనా మాట్లాడగలరా?' అని విలేఖరులు అడుగగా.. అప్పూ చనిపోవడం నన్ను ఎంతో కలచివేసిందని తారక్‌ భావోద్వేగానికి గురయ్యారు.

పునీత్‌ లేని కర్ణాటక జీరోగా కనిపిస్తోందని.. ఎక్కడ ఉన్నా ఆయన ఆశీర్వాదాలు మాత్రం తనకు ఎప్పుడూ ఉంటాయని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 'గెలయా గెలయా..' సాంగ్‌ ను ఆలపించారు. ఈ పాటను తాను ఇంకెప్పుడు పాడనని.. చివరిసారిగా పునీత్ గౌరవార్థం పాడుతున్నానంటూ ఎన్టీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు.

ఈ క్రమంలో కన్నడలో సొంతంగా డబ్బింగ్‌ చెప్పడం వల్ల భాషాపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని మీడియా ప్రశ్నించగా.. ''మా అమ్మ కర్ణాటకకు చెందిన వారే. ఈ సినిమా డబ్బింగ్‌ సమయంలో ‘జాగ్రత్తగా మాట్లాడు’ అని అమ్మ ఒక్కటే చెప్పారు. కన్నడ రచయిత వరదరాజు మాకు భాషాపరంగా శిక్షణ ఇచ్చారు. దానివల్ల డబ్బింగ్‌ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు'' అని వివరించారు.

కాగా, రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలతో పాటుగా కన్నడలోనూ భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు.