Begin typing your search above and press return to search.

సమంత ఆరోగ్యంపై స్పందించిన ఎన్టీఆర్ - రామ్ - నాని..!

By:  Tupaki Desk   |   29 Oct 2022 3:34 PM GMT
సమంత ఆరోగ్యంపై స్పందించిన ఎన్టీఆర్ - రామ్ - నాని..!
X
అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించి అందరినీ షాక్ కు గురి చేసింది. తనకు మైయోసిటిస్ అనే వ్యాధి సోకినట్లు పేర్కొన్న సామ్.. చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అభిమానులతో పాటుగా స్నేహితులు శ్రేయోభిలాషులు మరియు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

సమంత తన ఆరోగ్యం గురించి చేసిన ట్వీట్ పై తాజాగా విషయంపై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 'త్వరగా కోలుకో సామ్. నీకు తగినంత బలాన్ని పంపుతున్నా' అని ట్వీట్ చేశారు తారక్. అలానే రామ్ పోతినేని - నాని - సందీప్ కిషన్ వంటి పలువురు హీరోలు కూడా సామ్ ట్వీట్ పై స్పందించారు.

'ఇది కూడా ఎప్పటిలాగే గడిచిపోతుంది.. ఎప్పటిలాగే నువ్వు ఇప్పుడు కూడా మరింత బలంగా తిరిగొస్తావ్' అని రామ్ ట్విట్టర్ వేదికగా సామ్ కోలుకోవాలని పోస్ట్ చేశారు. 'టేక్ కేర్ సమంత.. నువ్వు ఎప్పటిలాగే స్ట్రాంగ్ తిరిగి రావడానికి వేచి చూస్తుంటాను' అని నాని ట్వీట్ లో పేర్కొన్నారు.

'నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ.. గెట్ వెల్ సూన్ సామ్' అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. 'మేమంతా మీతో ఉన్నాము.. త్వరలో కోలుకో సమంత' అని ఆమెతో 'శాకుంతలం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు గుణశేఖర్ ట్విట్టర్ ద్వారా కోరుకున్నారు.

ఇలా అందరూ సోషల్ మీడియా వేదికగా సామ్ త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలని ఆమెకు మనో ధైర్యాన్ని అందిస్తున్నారు.

కాగా, సమంత గత కొన్నాళ్లుగా సినిమాలకు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ వచ్చాయి. చర్మ సంబంధిత వ్యాధితో బాధ పడుతోందని.. అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది.

అయితే ఎన్ని రూమర్స్ వచ్చినా సమంత మాత్రం మౌనంగా ఉంటూ వచ్చింది. ఆ మధ్య ఓ ఆసక్తికరమైన పోస్టుతో సోషల్ మీడియాకు తిరిగి వచ్చింది. తన పెట్ డాగ్ ఫొటోను షేర్ చేస్తూ 'డౌన్.. నాట్ అవుట్' అనే క్యాప్షన్ పెట్టింది. ఆ తర్వాత తన ఫేస్ కనిపించకుండా టీ-షర్టు మీద క్యాప్షన్ కనిపించేలా ఓ ఫొటోని షేర్ చేసింది.

ఇందులో 'ఒకవేళ మీరు దీన్ని కూడా వినవలసి వస్తే.. మీరు ఎప్పటికీ ఒంటరిగా నడవరు' అనే క్యాప్షన్ రాయబడి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించి సోషల్ మీడియా ద్వారా అన్ని ఊహాగానాలను క్లియర్ చేసింది. కండరాల బలహీనత.. ఎక్కువసేపు నిల్చోలేకపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.

ఇకపోతే సమంత నటించిన 'యశోద' అనే థ్రిల్లర్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ ట్రైలర్ ను లాంచ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.