Begin typing your search above and press return to search.

అసలు ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ చూశాడా?

By:  Tupaki Desk   |   8 July 2017 11:58 AM GMT
అసలు ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ చూశాడా?
X
జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరలోకి వస్తాడని.. అందులోనూ ‘బిగ్ బాస్’ లాంటి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా తెలుగు బిగ్ బాస్ ఎన్టీఆర్ తోనే మొదలవుతోంది. ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తాడని ప్రకటన వచ్చిన నెల రోజుల్లోనే ఈ షో టీవీలో ప్రసారం కూడా అయిపోనుంది. ఈ నెల 16న బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో స్టార్ మా ఛానెల్ నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు తారక్. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో గురించి తన అభిప్రాయాల్ని తెలియజేశాడు. ఎన్టీఆర్ కు అసలు హిందీ.. ఇంగ్లిష్ ‘బిగ్ బాస్’ షోల గురించి పెద్దగా తెలియదట. ఆ షోలు తాను పెద్దగా చూసింది కూడా లేదని అతను వ్యాఖ్యానించాడు.

తనకు ఒకప్పుడు ‘బిగ్ బాస్’ గురించి ఏమీ తెలియదని.. ఐతే తన కజిన్ ఒకరు ఈ షోను విపరీతమైన ఆసక్తితో చూసేదని ఎన్టీఆర్ వెల్లడించాడు. తాను బయటికి వెళ్తుంటే ఒక రోజు తను భయంకరమైన సౌండ్ పెట్టుకుని బిగ్ బాస్ చూస్తూ ఉండిందని.. సల్మాన్ ఎవరిమీదో సీరియస్ అయితే.. తన దగ్గరికి వచ్చి ‘బిగ్ బాస్ తిట్టేశాడు’ అంటూ ఎగ్జైట్మెంట్ తో చెప్పిందని తారక్ చెప్పాడు. బిగ్ బాస్ తిట్టడమేంటో తనకు అప్పుడు అర్థం కాలేదన్నాడు. ప్రపంచంలో ఏదో వింత జరిగినట్లుగా తన కజిన్ ఆ షో గురించి చెప్పిందన్నాడు. ఆ రోజే తొలిసారి బిగ్ బాస్ గురించి విన్నానని.. తర్వాత కూడా అక్కడక్కడా రెండు మూడు ఎపిసోడ్లు చూడటమే తప్ప ఆ షోను కీన్ గా ఫాలో అయ్యింది లేదన్నాడు. ఐతే ప్రపంచవ్యాప్తంగా ఈ షోకు మంచి ఆదరణ ఉందని మాత్రం తనకు అర్థమైందన్నాడు. ఈ షోకు హోస్ట్ గా ఎంపికయ్యాక కూడా హిందీ.. ఇంగ్లిష్ ‘బిగ్ బాస్’ షోలు పెద్దగా చూడలేదని.. అంతా చూసేస్తే అది తన మీద ప్రభావం చూపిస్తుందన్న ఉద్దేశంతో చూడలేదని ఎన్టీఆర్ చెప్పాడు. టెలివిజన్ హోస్ట్ ఎలా ప్రవర్తిస్తాడు.. ఎలా మాట్లాడతాడు అన్నది కూడా తనకు అవగాహన లేదని.. అయినప్పటికీ పెద్దగా ఆలోచించకుండా ఈ షోకు ఒప్పుకున్నానని.. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమని.. అందుకే ఈ షో చేస్తున్నానని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ షో గురించి చెప్పగానే ఒప్పేసుకోమని తన కజిన్ ప్రాణాలు తోడేసిందని ఎన్టీఆర్ చెప్పాడు.