Begin typing your search above and press return to search.

మహా నాయకుడు కూడా వచ్చేస్తున్నాడు!!

By:  Tupaki Desk   |   4 Oct 2018 12:54 PM GMT
మహా నాయకుడు కూడా వచ్చేస్తున్నాడు!!
X
ఎన్టీఆర్ బయోపిక్ స్పీడ్ మాములుగా లేదు. క్రిష్ టీమ్ ప్రమోషన్ విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉంటూ అభిమానులు సైతం ఊహించని ట్విస్టులతో షాక్ ఇస్తోంది. ఉదయం ఎన్టీఆర్ కథానాయకుడు పేరుతో వదిలిన పోస్టర్ ని చూసుకుంటూ ఇంకా దాని తాలూకు ప్రభావం నుంచి బయటికి రాకముందే ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ మహానాయకుడు పేరుతో దాని సీక్వెల్ పోస్టర్ ని విడుదల తేదీతో సహా ప్రకటించేసారు.

జనవరి 24న మహానాయకుడు విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ బాలయ్య కొత్త లుక్ తో ఉన్న మరో పోస్టర్ రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానుల ఆనందం రెట్టింపు అవుతోంది. జనవరి 9 కథా నాయకుడు జనవరి 24 మహా నాయకుడు ఇలా కేవలం 15 రోజుల వ్యవధిలో బయోపిక్ సీక్వెల్స్ అంటే సినిమా లవర్స్ కన్నుల పండగే.

ఉదయం ఊహించినట్టే మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన కథ మాత్రమే ఉండబోతోంది. తెలుగుదేశం పార్టీని స్థాపించే నాటికి ఉన్న పరిస్థితులు అప్పుడు ఆయనతో ఉన్న వ్యక్తులు జరిగిన సంఘటనలు అధికారంలోకి రావడానికి దారి తీసిన కారణాలు ఇవన్నీ ఇందులో చూపించబోతున్నారు.

కాకపోతే ఆయన చరమాంక జీవితం ఇందులో ఉంటుందా లేదా అనే విషయం గురించి మాత్రం ఇంకా స్పష్టత లేదు. టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ ముందు నుంచి ఉన్నప్పటికీ ఇంత అతి తక్కువ గ్యాప్ లో ఒకే స్టార్ హీరో రెండు సినిమాలు రావడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. దర్శకుడు క్రిష్ మొత్తానికి పెద్ద బాధ్యతని మోస్తున్నాడు. సో నారా చంద్రబాబు నాయుడుగా రానాని చూసే ఛాన్స్ ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా ఉండకపోవచ్చు. అలాగే ఎఎన్ ఆర్ ఎస్విఆర్ లాంటి దిగ్గజాల పాత్రలు సెకండ్ పార్ట్ లో కనిపించకపోవచ్చు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ క్రమం తప్పని అప్ డేట్స్ తో హైప్ ని బాగానే పెంచుకుంటోంది.