Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం కొరటాల భలే స్టోరీ రాసుకున్నాడే!

By:  Tupaki Desk   |   16 Feb 2022 5:00 AM IST
ఎన్టీఆర్ కోసం కొరటాల భలే స్టోరీ రాసుకున్నాడే!
X
ఇండస్ట్రీకి రచయితలుగా వచ్చిన చాలామంది ఆ తరువాత దర్శకులుగా మారిపోయారు. త్రివిక్రమ్ .. అనిల్ రావిపూడి .. ఇలా చాలామంది రచన వైపు నుంచి వచ్చి మెగాఫోన్ పట్టినవారే. అలాంటి దర్శకులలో కొరటాల ఒకరు. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా కనిపిస్తూ, తాను చెప్పదలచుకున్న విషయాన్ని నీట్ గా చెప్పే దర్శకులలో కొరటాల ఒకరుగా కనిపిస్తాడు. ప్రతి సినిమాతో ఒక సందేశాన్ని ఇవ్వడం కొరటాలకి అలవాటు. ఆ సందేశాన్ని క్లారిటీగా ఇవ్వడం కూడా ఆయన ప్రత్యేకతగా కనిపిస్తుంది.

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వకుండా, సినిమా సినిమాకి సక్సెస్ రేటును పెంచుతున్న దర్శకులలో రాజమౌళి .. అనిల్ రావిపూడి వంటి వారి సరసన కొరటాల కనిపిస్తారు. అందువలన ఆయనతో కలిసి పనిచేయడానికి అంతా ఆసక్తిని చూపుతుంటారు.

ఒకసారి కలిసి పనిచేసిన స్టార్ హీరోలు సైతం ఆయనతో మరో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తుంటారు. 'శ్రీమంతుడు' చేసిన మహేశ్ ఆ తరువాత ఆయనతో 'భరత్ అనే నేను' చేయడం .. 'జనతా గ్యారేజ్' చేసిన ఎన్టీఆర్ ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతుండటమే అందుకు నిదర్శనం.

ఎన్టీఆర్ తో కొరటాల చేయనున్న సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. మార్చి మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో కొరటాల ఉన్నాడు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ బస్తీ విద్యార్థులు హక్కుల కోసం పోరాడే స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపించింది. అందుకోసం అవినీతి రాజకీయ నాయకుల భారతం పడతాడని అన్నారు. కానీ ఈ సినిమా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నడుస్తుందనే వేరే లైన్ ఇప్పుడు వినిపిస్తోంది.

చాలా ప్రాంతాల్లో ఆచారాల పేరుతో మూఢనమ్మకాలను మనం చూస్తూనే ఉంటాము. ఆచారం పేరుతో తమని తాము గాయపరుచుకోవడం .. శిక్షించుకోవడం చూస్తుంటాము. అలాంటి మూఢనమ్మకాల వైపు నుంచి చైతన్యం వైపుకు జనాలను నడిపించే సందేశంతో ఈ కథ నడుస్తుందని చెప్పుకుంటున్నారు.

వినోదం పాళ్లు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల ఈ సందేశాన్ని ఇస్తాడని అంటున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ జోడీగా అలియా భట్ కనిపించనుంది. ఎన్టీఆర్ జోడీగా ఆమె ఎంతవరకూ సెట్ అవుతుందనేది చూడాలి మరి.