Begin typing your search above and press return to search.

బయోపిక్ లకు బ్రేకులు పడతాయా?

By:  Tupaki Desk   |   17 Jan 2019 11:00 PM IST
బయోపిక్ లకు బ్రేకులు పడతాయా?
X
ఎన్టీఆర్ కథానాయకుడు ఎంత పుష్ చేసినా ఫైనల్ గా డిజాస్టర్ ముద్ర తప్పేలా లేదు. వారం దాటినా ఇంకా 20 కోట్ల షేర్ చేరుకోలేకపోవడం మరోవైపు జనం బాలేదన్నా వినయ విధేయ రామ ఆ మార్కును అందుకోవడం రెండు రకాలుగా అభిమానులను ఇబ్బంది పెడుతోంది. టాక్ పాజిటివ్ గా వచ్చినా ఇలాంటి స్టాంప్ వేయించుకోవడం అంటే ఫ్యాన్స్ కు బాధ కలిగించేదే. అయితే ఇప్పుడీ పరిణామం రాబోతున్న బయోపిక్ లకు ఓ వార్నింగ్ బెల్ లా మారడం ఖాయమని చెప్పొచ్చు. మహానటి పుణ్యమా అని దాని తర్వాత మేమంటే మేమంటూ బయోపిక్ లు తీసేందుకు సిద్ధపడ్డారు దర్శక నిర్మాతలు.

ఒకరు సౌందర్య కథను సినిమా తీస్తానని ప్రకటించి ఆ తర్వాత వర్క్ అవుట్ కాదని గుర్తించి చల్లగా జారుకోవడం అందరికీ గుర్తే. ఇప్పుడు కత్తి వీరుడు కాంతారావు కథతో పాటు ఘంటసాల బయోపిక్ లు షూటింగ్ లో ఉన్నాయి. మరికొన్ని స్క్రిప్ట్ స్టేజి లో సీరియస్ చర్చల్లో కాలం గడుపుతున్నాయి. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు నేర్పిన పాఠం మాత్రం చాలా గొప్పది. స్టార్ హీరో ఇమేజ్ అభిమానుల అండదండలు ఉన్నంత మాత్రాన బయోపిక్ లు ఆడవని తేలిపోయింది. సో ఇకపై ఈ ఆలోచన చేయాలి అనుకున్న వాళ్ళు చాలా లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్ కథను లైట్ గా టచ్ చేసి ఆయన పాత పాటలతో నింపేస్తే చాలు జనం ఎగబడి చూస్తారనుకున్న క్రిష్ టీమ్ అంచనా మొత్తానికే మోసం చేసింది. నిజమైన కథ అయినా లేక ఫిక్షన్ అయినా ఎమోషన్ లేనిదే ప్రేక్షకులు కనెక్ట్ కారనే సత్యం బాక్స్ ఆఫీస్ వసూళ్ల సాక్షిగా ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మహానాయకుడు ముందు ప్రకటించిన ఫిబ్రవరి 7కే తేవాలా వద్దా అనే మీమాంస మొదలైపోయింది. ఇప్పటికే వాయిదా గురించి చాలా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహానటి ఇచ్చిన జోష్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేటప్పటికి వార్నింగ్ గా మారిపోయింది. అదే కాల మహత్యం అంటే.