Begin typing your search above and press return to search.

బుల్లితెరపై మరోసారి తారక్ మంటలు

By:  Tupaki Desk   |   8 July 2018 10:58 AM IST
బుల్లితెరపై మరోసారి తారక్ మంటలు
X
గత ఏడాది ఇదే సమయానికి బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తొలిసారిగా ‘బిగ్ బాస్’ షో కోసం హోస్ట్ అవతారమెత్తి ప్రకంపనలు రేపాడు తారక్. ఆ షో సూపర్ హిట్ కావడంలో జూనియర్ ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. మా టీవీ రేటింగ్స్ పెరగడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఈసారి కూడా ‘బిగ్ బాస్’లో తారక్ ను చూడాలని అభిమానులు ఆశించారు కానీ.. అది సాధ్యపడలేదు. ఐతే ఇప్పుడు తారక్ మరోసారి బుల్లితెరపై మంటలు రేపడానికి రెడీ అయ్యాడు. అతను ఈసారి ఈటీవీలో క్యామియో చేస్తున్నాడు. ఆ ఛానెల్లో రెండు రోజుల పాటు సందడి చేయబోతున్నాడు. ఈటీవీలో ప్రసారమయ్యే టాప్ డ్యాన్సింగ్ షో ‘ఢీ’లో అతను పాల్గొంటున్నాడు.

ఢీ-10 గ్రాండ్ ఫినాలెకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. ఇప్పటిదాకా బుల్లతెరపై ఏ రియాల్టీ షోకూ ఎన్టీఆర్ అతిథిగా హాజరైంది లేదు. ఐతే ఢీ పదో వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్ ఫినాలెను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో పోటీ మామూలుగా లేదు. బుల్లితెరపై టాప్ రేటింగ్స్ ఉన్న షోల్లో ఇదొకటి. గ్రాండ్ ఫినాలెపైనా భారీ అంచనాలున్నాయి. గతంలో ‘ఢీ’ ఫైనల్స్ కోసం ప్రభుదేవా లాంటి వాళ్లను పిలిచింది ఈటీవీ. ఈసారి తారక్ ను జడ్జిగా ఒప్పించారు. ఈ ఆదివారం.. వచ్చే ఆదివారం రెండు ఎపిసోడ్లలో ఎన్టీఆర్ దర్శనమివ్వబోతుండటం విశేషం. అతడి రాకను హైలైట్ చేస్తున్న భారీ స్థాయిలో ఒక ప్రోమో కూడా కట్ చేశారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు అది చూసి ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ ప్రెజెన్స్ తో షో మరో రేంజికి వెళ్తుందనడంలో సందేహం లేదు. ఈ రెండు ఎపిసోడ్లకు భారీ రేటింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.