Begin typing your search above and press return to search.

రాజమౌళితో సినిమా అంటే అంత వీజీ కాదండోయ్!

By:  Tupaki Desk   |   25 Dec 2021 4:33 AM GMT
రాజమౌళితో సినిమా అంటే అంత వీజీ కాదండోయ్!
X
రాజమౌళి సినిమా అంటే చూసేవాళ్లకి చాలా సరదాగా ఉంటుంది. కానీ చేసేవాళ్లకి చాటవుతుంది. ఎందుకంటే ఆయన తన సినిమాలకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను అలాగే డిజైన్ చేసుకుంటారు మరి. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగు మొదలుపెట్టిన దగ్గర నుంచి తమని వదిలిపెట్టలేదనీ .. కొత్తరకం సాహసాలు తమతో చాలానే చేయించారని తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పాడు. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సాధారణంగా ఒక సినిమాకి సంబంధించిన నటీనటులు ముందుగా ఒక టీమ్ గా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ, ఆ తరువాత వేరు వేరుగా ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. కానీ రాజమౌళి సినిమాలకు దాదాపుగా అలా ఉండదు.

ప్రధానమైన పాత్రలతో రాజమౌళి తప్పకుండా వస్తుంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కడ పొరపాటున సినిమాకి సంబంధించిన కీలకమైన అంశాలను బయటికి చెప్పేస్తారేమోననే విషయంలో ఆయన ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

అలాగే ఆయన 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లోను ఎన్టీఆర్ - చరణ్ లతో కలిసే పాల్గొంటున్నారు. ముగ్గురూ కూడా చాలా సందడి చేస్తూ ఈ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒక దర్శకుడికి .. హీరోలకి మధ్య ఇలాంటి ఒక వాతావరణం ఉండాలనిపించేలా సరదాగా తమ పని కానిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. "రాజమౌళి గారు ఈ సినిమా షూటింగు మొదలైన రోజునే నన్ను 60 అడుగుల ఎత్తులో వేలాడదీశారు. ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన చరణ్ నన్ను చూసి ఆశ్చర్యపోతూ అలాగే ఉండిపోయాడు.

అలా అని చెప్పేసి మొదటి రోజు ఖాళీగా ఉంచాడని అనుకుంటే పొరపాటే. రెండవ రోజు చేయవలసిన ఈ సన్నివేశాలను రిహార్సల్స్ చేయించారు. ఆ సీన్ చేసిన తరువాత బ్రతుకు జీవుడా అనుకుంటే, ఆ వెంటనే మా ఇద్దరినీ 20 అడుగుల లోతులో నీళ్లలోకి దింపారు. చరణ్ కి ఇలాంటివి అలవాటే కానీ నేను మాత్రం ఇబ్బంది పడిపోయాను బాబోయ్" అంటూ చెప్పాడు. రాజమౌళి మాత్రం ఆ మాటలు వింటూ ఎప్పటిలానే ముసి ముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమరం భీమ్ పాత్ర .. చరణ్ పోషించిన అల్లూరి పాత్ర వారి కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలవనున్నాయని చెప్పచ్చు.