Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బాక్సాఫీస్ హిట్స్ - రిజెక్ట్ చేసిన సూపర్ హిట్స్..!

By:  Tupaki Desk   |   20 May 2021 9:30 AM GMT
ఎన్టీఆర్ బాక్సాఫీస్ హిట్స్ - రిజెక్ట్ చేసిన సూపర్ హిట్స్..!
X
నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినప్పటికీ.. తన ప్రతిభతో కష్టంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ వచ్చాడు తారక్. హిట్ వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ప్లాప్ వచ్చినప్పుడు కృంగిపోకుండా స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. తన ఇమేజ్ కి తగ్గట్లుగా కథలను ఎంచుకుంటూ వస్తున్న ఎన్టీఆర్.. నటనలో డైలాగ్ డెలివరీలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరిగా నిలబడిన ఎన్టీఆర్ కెరీర్ లో హిట్ సినిమాల జాబితా చూద్దాం!

ఎన్టీఆర్ హీరోగా నటించిన రెండో సినిమా 'స్టూడెంట్ నెంబర్ 1' తో సూపర్ హిట్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. ఈ క్రమంలో వచ్చిన 'ఆది' సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా.. తనలోని యాక్షన్ కోణాన్ని చూపించాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాతో నూనూగు మీసాల వయసులో ఎన్టీఆర్ రికార్డులు క్రియేట్ చేసాడు. ఇక రాజమౌళి తో చేసిన 'సింహాద్రి' సినిమా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమా అప్పటికి ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించింది.

అర డజను సినిమాలు ప్లాప్ అయిన తర్వాత వచ్చిన 'యమదొంగ' చిత్రం ఎన్టీఆర్ ని నిలబెట్టింది. రాజమౌళి తో కలిసి చేసిన ఈ హ్యాట్రిక్ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వీవీ వినాయక్ దర్శకత్వంలో చేసిన మూడో సినిమా 'అదుర్స్' లో యాక్షన్ తో పాటు తనలోని కామెడీ టైమింగ్ ని బయటపెట్టాడు. వంశీ పైడిపల్లితో చేసిన 'బృందావనం' సినిమాలో సాఫ్ట్ యాంగిల్ చూపించి హిట్ కొట్టాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన 'బాద్ షా' సినిమా పర్వాలేదనిపించింది. ఇక 'టెంపర్' సినిమాతో ట్రాక్ మార్చి సూపర్ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. అప్పటి నుంచి హిట్స్ మీద హిట్స్ కొడుతూ తన నట విశ్వరూపాన్ని చూపించాడు.

సుకుమార్ తో చేసిన 'నాన్నకు ప్రేమతో'.. కొరటాల శివ తో చేసిన 'జనతా గ్యారేజ్' సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవకుశ' చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం చేసి అబ్బురపరిచారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం రాజమౌళి - రామ్ చరణ్ లతో కలసి చేస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంటాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇదే క్రమంలో కొరటాల శివ తో మరో సినిమా.. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేయనున్నాడు.

ఇదిలావుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని బాక్సాఫీస్ హిట్ చిత్రాలను కూడా అనుకోని కారణాలతో వదులుకోవాల్సి వచ్చింది. వి.వి.వినాయక్ - నితిన్ కాంబోలో వచ్చిన 'దిల్' సినిమా కథ ముందుగా ఎన్టీఆర్ కే చెప్పారు. అయితే 'ఆది' తర్వాత చేసే సినిమా కావడం వల్ల తనకు సెట్ అవ్వదనే అనుమానంతో రిజెక్ట్ చేసాడు. అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన 'ఆర్య' సినిమా కూడా తారక్ చేయాల్సింది. సుకుమార్ చెప్పిన స్టోరీ నచ్చినప్పటికీ.. యాక్షన్ బాటలో వెళ్తున్న తనకు అలాంటి లవ్ స్టోరీ కుదరదేమో అని ఎన్టీఆర్ భావించారు.

దర్శకుడు సురేందర్ రెడ్డి 'అతనొక్కడే' కథను ఎన్టీఆర్ కు వినిపించగా.. ఇది తన అన్న కళ్యాణ్ రామ్ కి బావుంటుందని సలహా ఇచ్చారు. రవితేజ - వినాయక్ కాంబోలో వచ్చిన 'కృష్ణ' సినిమా కూడా తారక్ వదులుకున్నదే. బోయపాటి శ్రీను 'భద్ర' కథను మిగతా హీరోలతో పాటుగా ఎన్టీఆర్ కు చెప్పాడు. అలానే రవితేజ చేసిన 'కిక్' సినిమా కథను సూరి ముందుగా నందమూరి హీరోకే చెప్పాడు. అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' కథను రామ్ తో పాటుగా తారక్ కు చెప్పారని అంటుంటారు. ఇక కొరటాల శివ చెప్పిన 'శ్రీమంతుడు' కథని బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ వదిలేసుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కింగ్ నాగార్జున - కార్తీ హీరోలుగా నటించిన సూపర్ హిట్ 'ఊపిరి' సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా వదిలేసుకోవడంతో ఆ పాత్ర కార్తీ దగ్గరకు వెళ్ళింది.