Begin typing your search above and press return to search.

‘బిగ్ బాస్’ షో నిర్వాహకుల గుండెలు గుబేల్

By:  Tupaki Desk   |   10 July 2017 10:54 AM GMT
‘బిగ్ బాస్’ షో నిర్వాహకుల గుండెలు గుబేల్
X
ఎవరైనా పెద్ద హీరో టెలివిజన్ రంగంలోకి వస్తున్నాడంటే.. ఆ హీరో చేసే తొలి షో మీద జనాల్లో మంచి అంచనాలుంటాయి. అందులోనూ ఎన్టీఆర్ లాంటి మంచి వాక్చాతుర్యం.. తెలివితేటలు ఉన్న హీరో అంటే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. అతను చేసే షో సూపర్ హిట్టవడం ఖాయం అనిపిస్తుంది. కానీ ‘బిగ్ బాస్’ షో విషయంలో మాత్రం ఆ భరోసా కనిపించట్లేదు. ఏ షో ఎంత పెద్ద రేంజికి వెళ్తుందన్న అంచనాలు అసలేమాత్రం లేవు. అసలు సక్సెస్ అవుతుందా లేదా అన్న డిస్కషనే నడుస్తోంది అన్ని చోట్లా. అందుక్కారణం తమిళ ‘బిగ్ బాస్’ షో అట్టర్ ఫ్లాప్ కావడమే. లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ అనగానే ఈ షో మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ తమిళ బిగ్ బాస్ పార్టిసిపెంట్ల వివరాలు బయటికి రావడం ఆలస్యం.. ఈ షో మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ మొదలైంది. ఇక షో చూశాక విమర్శలు మామూలుగా లేవు. ఈ షోను ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున వీడియోలు రెడీ అయిపోయాయి. తమిళ బిగ్ బాస్ షోకు జనాదరణ పేలవంగా ఉందని.. ఈ వీకెండ్ తమిళ టీవీ రేటింగ్స్ ను బట్టి తెలుస్తోంది. గత వారం విడుదల చేసిన రేటింగ్స్ లో ‘బిగ్ బాస్’ ఐదో స్థానానికి పరిమితమయ్యాయి. రెండు టీవీ సీరియళ్లు.. రెండు సినిమాలకు దాని కంటే ఎక్కువ రేటింగ్స్ వచ్చాయి. దీన్ని బట్టి ‘బిగ్ బాస్’ షో పెద్ద ఫ్లాప్ అని.. కమల్ కూడా ఆ షోను కాపాడలేకపోయాడని తేలిపోయింది. మరి తెలుగులో మాత్రం ‘బిగ్ బాస్’ ఏమాత్రం సక్సెస్ అవుతుంది అన్న సందేహాలు మరింత పెరుగుతున్నాయి. వీకెండ్లో ఎన్టీఆర్ వచ్చే రెండు రోజులు షోకు ఆదరణ బాగుంటుందేమో కానీ.. పార్టిసిపెంట్లు మాత్రమే కనిపించే వీక్ డేస్ లో జనాల దృష్టిని ఆకర్షించడం కష్టమే అనిపిస్తోంది. కేవలం ఎన్టీఆర్ ముఖచిత్రం చూపించి షోను ముందుకు లాక్కెళ్లడం కష్టం. హిందీ బిగ్ బాస్ సల్మాన్ వల్ల ఆడలేదు. అతను ఓ ఆకర్షణ మాత్రమే. అక్కడ షోకు అద్భుత ఆదరణ దక్కింది. మరి తెలుగులో ఏం జరుగుతుందో చూడాలి.