Begin typing your search above and press return to search.

మెట్రో రైల్‌ లొకేష‌న్‌ కి 40ల‌క్ష‌లే!

By:  Tupaki Desk   |   4 Aug 2018 4:34 PM GMT
మెట్రో రైల్‌ లొకేష‌న్‌ కి 40ల‌క్ష‌లే!
X
ఒక్కో సినిమాకి 50కోట్లు - 60 కోట్లు అంటూ మ‌న నిర్మాత‌లు బ‌డ్జెట్ల గురించి మాట్లాడుతుంటే క‌ళ్లు తేలేయాల్సిన ప‌రిస్థితి ఉంటోంది. అస‌లు అంత ఖ‌ర్చు ఎందుకు అవుతుంది? అంటే స్టార్‌ హీరోలు - స్టార్ డైరెక్ట‌ర్ల పారితోషికాలే బ‌డ్జెట్‌ లో స‌గం ఉంటాయ‌ని లెక్క‌లు తీస్తాం. అయితే కేవ‌లం ఈ పారితోషికాల వ‌ల్ల‌నే అంత ఖ‌ర్చ‌వుతోందా? అంటే కానేకాదు. సినిమా 24 శాఖ‌ల్లో భారీ - అతి భారీ పెట్టుబ‌డులు పెట్టాల్సిన విభాగాలు వేరే ఉన్నాయి. లొకేష‌న్లు - సెట్ల‌కు అంతే భారీ ఖ‌ర్చు త‌ప్ప‌డం లేదన్న‌ది కొన్ని భారీ చిత్రాల బ‌డ్జెట్ లు ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది.

భారీ రిచ్ లొకేష‌న్ ల‌లో షూటింగులు చేయాలంటే అనుమ‌తుల కోసం అంతే భారీ మొత్తాల్ని చెల్లించాల్సి వ‌స్తోంది. ఇటీవ‌లే ప్ర‌భాస్ `సాహో` కోసం దుబాయ్ షెడ్యూల్స్‌ లొకేష‌న్ల కోస‌మే యు.వి.క్రియేష‌న్స్ సంస్థ కోట్ల‌లో ఖ‌ర్చు చేసింది. దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫా ప‌రిస‌రాల్లో - ర‌ద్దీగా ఉండే ఓ భారీ ఫ్లై ఓవ‌ర్‌ పై.. అతి భారీ యాక్ష‌న్ సీక్వెన్సుల చిత్రీక‌ర‌ణ కోసం హై ఎండ్ హై రిస్కీ లొకేష‌న్ల అనుమ‌తులు తీసుకోవాల్సి వ‌చ్చింది. దాంతో అక్క‌డ ఖ‌ర్చు త‌డిసిమోపెడు అయిపోయింది. కేవ‌లం విదేశాల్లోనే కాదు స్వ‌దేశంలోనూ అందునా హైద‌రాబాద్ - ముంబై - కోల్‌ క‌త‌ వంటి మెట్రో న‌గ‌రాల్లో కొన్ని లొకేష‌న్ల‌కు అనుమ‌తులు పొందాలంటే అంతే భారీగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని ఇదిగో ఈ లోక‌ల్ మెట్రో ఎగ్జాంపుల్ ఒక‌టి తెలియ‌జెబుతోంది.

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `అర‌వింద స‌మేత‌`కు లొకేష‌న్ల కోసం భారీగానే ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. హైద‌రాబాద్‌- మ‌ల‌క్‌ పేట్‌ మెట్రో రైల్వేస్టేష‌న్‌ లో చిత్రీక‌ర‌ణకు టీమ్ భారీగా ప్లాన్స్ చేస్తోంది. ఈ లొకేష‌న్ కోసం ప్ర‌భుత్వ అనుమ‌తికి ఎంత ఖ‌ర్చ‌వుతోందో తెలుసా? ఏకంగా 50 ల‌క్ష‌ల మేర చెల్లించ‌నున్నార‌ని తెలుస్తోంది. తొలుత ఆ డిపార్ట్‌ మెంట్ నుంచి అనుమ‌తి పొందేందుకు 40ల‌క్ష‌లు చెల్లించార‌ట‌. అలానే ఇన్‌ సైడ్ కావాల్సిన చోట‌ల్లా తెర‌కెక్కించాలంటే అద‌నంగా 10 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చిందిట‌. కేవ‌లం ఒక రోజు షూటింగ్ కోసం చెల్లిస్తున్న‌ది ఇది. ఈ అనుమ‌తుల కోసమే ఇంత పెద్ద మొత్తం పెడుతున్నారంటే - ఇక చిత్రీక‌ర‌ణ‌కు ఇంకెంత‌ ఖ‌ర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక‌రోజు యూనిట్ మెయింటెనెన్స్ ఖ‌ర్చు - ప్రొడ‌క్ష‌న్ కాస్ట్‌ - ఇత‌ర‌త్రా లెక్కిస్తే ఎంత‌వుతుందో అంచ‌నా వేయొచ్చు. ప్ర‌తిరోజూ ఇలాంటి అవ‌స‌రం రాక‌పోయినా సంద‌ర్భానుసారం ఇలాంటి ఖ‌ర్చు త‌ప్ప‌నిస‌రి. ఒక్కోసారి అనుకున్న‌ట్టు అన్నీ కుద‌ర‌క ప‌రిస్థితి అదుపు త‌ప్పితే ఆ ఖ‌ర్చు రెట్టింపు అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. వీట‌న్నిటినీ నిర్మాత‌లు భ‌రించాల్సి ఉంటుంది. ఆ మేర‌కు తార‌క్ యూనిట్ నుంచి క్లోజ్ సోర్సెస్ వివ‌రాలు అందించింది. స్టార్ హీరోల సినిమాల‌కు 50కోట్లు - 60 కోట్లు ఖ‌ర్చ‌వ్వ‌డానికి కార‌ణం మ‌రింత స్ప‌ష్టంగా అర్థ‌మైంది క‌దూ?