Begin typing your search above and press return to search.

18 ఏళ్ళు.. అయినా జక్కన్నతో సేమ్ ఫన్!

By:  Tupaki Desk   |   27 Sept 2019 9:00 PM IST
18 ఏళ్ళు.. అయినా జక్కన్నతో సేమ్ ఫన్!
X
స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ చాలా సన్నిహితులనే సంగతి అందరికీ తెలుసు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం 'స్టూడెంట్ నెం.1'. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా విడుదలై నేటికి 18 ఏళ్ళు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

అయితే అభిమానులు మాత్రమే కాదు.. అటు ఎన్టీఆర్ ఇటు రాజమౌళి ఇద్దరూ తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి '18 ఏళ్ళు అయింది. #స్టూడెంట్ నెం.1 ఈరోజే రిలీజ్ అయింది. అనుకోకుండా ఈరోజు మేమిద్దరం రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాం. చాలా మారిపోయింది..తారక్ సన్నగా మారిపోయాడు. నేను పెద్ధవాడిని అయ్యాను.. ఇద్దరి అనుభవం పెరిగింది" అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "#స్టూడెంట్ నెం.1 కు 18 ఏళ్ళు. కాకతాళీయంగా మేము ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాం. సరిగ్గా ఇక్కడే ఈ షాట్ ను చిత్రీకరించాం.. ఎంతో మారిపోయింది కానీ జక్కన్న తో పని చేయడం లో ఫన్ మాత్రం సేమ్" అంటూ ట్వీట్ చేశారు. అప్పట్లో ఇద్దరూ కలిసి ఫోటో తీయించుకున్న సేమ్ లొకేషన్ లో అదే పోజిస్తూ మరో సారి ఫోటో తీయించుకున్నారు. ఈ ఫోటోలు అభిమానులనే కాకుండా తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తున్నాయి.

ఎన్టీఆర్.. గజాలా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'స్టూడెంట్ నెం.1' చిత్రం 27-09-2001 నాడు రిలీజ్ అయింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ 'RRR' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.