Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ చెప్పాడు.. రాజేంద్రుడు పాటించాడు

By:  Tupaki Desk   |   5 Sept 2017 10:05 PM IST
ఎన్టీఆర్ చెప్పాడు.. రాజేంద్రుడు పాటించాడు
X
కామెడీ పాత్రలతోనే హీరోగా గొప్ప స్థాయి అందుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్. టాలీవుడ్లో ఆయనో ట్రెండ్ సెట్టర్ అనడంలో సందేహం లేదు. కామెడీని తక్కువగా చూసే రోజుల్లో దాన్నే నమ్ముకుని ఆయన స్టార్ స్థాయిని అందుకున్నాడు. ఐతే ఈ విషయంలో తనకు స్ఫూర్తి నందమూరి తారక రామారావే అంటున్నాడు రాజేంద్రుడు. ఎన్టీఆర్ ఎప్పుడూ కామెడీ చేయలేదు కదా.. మరి రాజేంద్ర ప్రసాద్ కు ఆయనెలా స్ఫూర్తిగా నిలిచారు అన్న సందేహం రావడం సహజం. ఐతే దీని వెనుక ఓ కథ ఉందంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయాడు రాజేంద్రుడు.సినీ రంగంలోకి వచ్చే ముందు త‌న‌కు ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో గోల్డ్ మెడల్ వచ్చిందని.. దాన్ని పట్టుకుని ఎన్టీఆర్ వద్దకు వెళ్లాన‌న‌ని.. ఆ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌కు చెప్పిన మాట‌లే తన కెరీర్ ను మలుపు తిప్పాయని రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు.

గోల్డ్ మెడల్ చూపించగానే..సంతోషమంటూ మెచ్చుకుంటూనే.. సినీ పరిశ్రమలో ఒకరిలా మరొకరుంటే కష్టమని.. ‘పౌరాణిక పాత్రలనగానే మేమే గుర్తుకొస్తాం. సాంఘిక పాత్రలకు అక్కినేని నాగేశ్వరరావు.. డిష్యుం డిష్యుం చెయ్యాలంటే కృష్ణ.. రొమాంటిక్ కథలకు శోభన్ బాబు ఉన్నారు. మరి ఇక్కడ నీ ప్రత్యేకత ఏంటి’’ అని ఎన్టీఆర్ ప్రశ్నించినట్లు రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. ఆ మాటలతో ఆలోచనలో పడ్డాన‌ని.. తర్వాత తన ప్రత్యేకతను చాటుకోవాలన్న ఉద్దేశంతో కామెడీ చేయడం మొదలుపెట్టానని.. ఆ సినిమాల ద్వారానే తాను నటుడిగా మంచి స్థాయిని అందుకున్నానని.. అలా తన కెరీర్ మలుపు తిరగడానికి ఎన్టీఆర్ కారణమని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించాడు.