Begin typing your search above and press return to search.

బ‌న్నీ నో అన్నాడు.. ఎన్టీఆర్ సై అన్నాడు

By:  Tupaki Desk   |   30 Dec 2021 11:00 PM IST
బ‌న్నీ నో అన్నాడు.. ఎన్టీఆర్ సై అన్నాడు
X
టాలీవుడ్ హీరోల దృష్టి ప్ర‌స్తుతం మారింది. వారి ఫోక‌స్ మొత్తం ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల‌పైనే వుంది. టాలీవుడ్ లో ఎంత స్టార్ హీరోలైనా పాన్ ఇండియా స్థాయిలో త‌మ మార్కెట్ ని విస్త‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో ముందు వ‌రుస‌లో నిలిచిన హీరో ప్ర‌భాస్‌. ఇప్ప‌టికు `బాహుబ‌లి`తో ప్ర‌భాస్ గ్లోబ‌ల్ స్టార్ అయిపోయారు. దీంతో త‌రువాత చేస్తున్న సినిమాల‌ని కూడా ఆ స్థాయిలోనే ప్లాన్ చేసుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో త‌న సినిమాల‌కు మార్కెట్ ని ప‌దిలం చేసుకుంటున్నారు.

ఇదే త‌ర‌హాలో మిగ‌తా హీరోలు కూడా త‌మ వంతు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. `పుష్ప‌`తో బ‌న్నీ కూడా ఈ జాబితాలో చేర‌డం తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రూ త‌మ వాయిస్ ని ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల‌కు వినిపించకుండా డ‌బ్బింగ్ వేరే వారితో చెప్పించారు. ఇటీవ‌ల విడుద‌లైన `పుష్ప‌` చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధిస్తోంది. వ‌సూళ్ల ప‌రంగానూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

`పుష్ప‌` ఇత‌ర భాష‌ల్లో విడుద‌లైనా ఆయా భాష‌ల్లో త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డానికి బ‌న్నీ ఇష్ట‌ప‌డ‌లేదు. కార‌ణం ఆయా భాష‌ల్లో దాని సొంత ప్రామాణిక‌త వుంటుంద‌ని, దాన్ని క‌లుషితం చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ఇత‌ర భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి బ‌న్నీ నో అన్నారు. అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం సై అన్నారు. అదెలా అంటే `ఆర్ ఆర్ ఆర్‌` దాదాపుగా 14 భాష‌ల్లో జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో అంటే త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో త‌మ పాత్ర‌ల‌కు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ డ‌బ్బింగ్ చెప్పుకున్నారు.

ఇదే విష‌యాన్ని ఎన్టీఆర్ ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వెల్ల‌డించారు కూడా. `నేను హిందీలో అనువాదం అయిన చాలా సినిమాలు చూశాను. ఆ స‌మ‌యాల్లో అందులో న‌టించిన న‌టుడి క‌ళ్లు.. వెన‌క వ‌చ్చే వాయిస్ లు విన్నాను. అది నాకు చాలా వింత‌గా అనిపించింది. అప్పుడే నా సినిమాకు నేనే నా గొంతుతో డ‌బ్బింగ్ చెప్పుకుంటే మంచిద‌నిపించింది. ఆ అనుభ‌వం చాలా కొత్త‌గా వుంటుంది. అందుకే `ఆర్ ఆర్ ఆర్‌` కోసం నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను` అని స్ప‌ష్టం చేశాడు ఎన్టీఆర్‌.

ఒకే భాష‌కు చెందిన ఇద్ద‌రు న‌టుల్లో ఇంత భిన్న‌మైన ఆలోచ‌నా విధానం వుండ‌టం చిత్ర‌మే అయినా ఎవ‌రి ఆలోచ‌న వారిది. ఇందులో ఎవ‌రిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే భాష ఏదైనా ఆ భాష‌లో సొంత గొంతు వినిపిస్తేనే ఆ పాత్ర‌కు నిండుద‌నం వుంటుంద‌ని ఎన్టీఆర్ భావించారు. అదే ఇప్పుడు ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఎన్టీఆర్ కు ఇత‌ర భాష‌ల‌పై వున్నప‌ట్టుని చూపించి అంద‌రి చేత శ‌భాష్ అనిపిస్తోంది. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ ఎన్టీఆర్ ఇత‌ర భాష‌ల్లో చెప్పిన డ‌బ్బింగ్ కి మంచి రెస్పాన్స్ ల‌భిస్తుండటం గ‌మ‌నార్హం.