Begin typing your search above and press return to search.

అమెరికా డిస్ట్రిబ్యూటర్లను ముంచిన నవంబర్

By:  Tupaki Desk   |   3 Dec 2019 4:58 AM GMT
అమెరికా డిస్ట్రిబ్యూటర్లను ముంచిన నవంబర్
X
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కు ప్రముఖ ఆదాయ వనరు అయిన ఓవర్సీస్ మార్కెట్.. ముఖ్యంగా అమెరికా మార్కెట్ చర్చనీయాంశం అవుతోంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లాభాలు తీసుకురావడం లేదు. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉన్నాయి. మార్కెట్ స్టామినా కంటే స్టార్ హీరోల సినిమాలను ఎక్కువ పెట్టి కొనడం.. టికెట్ రేట్లు ఎక్కువగా నిర్ణయించి ప్రేక్షకులను బెదరగొట్టడం.. రోటీన్ సినిమాలను తీసి అసలే డాలర్ల సంపాదనలో బిజీగా ఉండే ఎన్నారైల సహనానికి టెస్ట్ పెట్టడం లాంటివి కొన్ని కారణాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా కారణాలు ఉన్నాయి.

అయితే ఇప్పటివరకూ పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మాత్రం నష్టాలు వస్తున్నాయి.. చిన్న సినిమాల పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉంది అనుకునేవారు. కానీ అవి కూడా డిస్ట్రిబ్యూటర్ల దుంపతెంచుతున్నాయి. నవంబర్లో రిలీజ్ అయిన సినిమాల విషయమే తీసుకుంటే.. యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదన్నది చేదు వాస్తవం. యూఎస్ లో ప్రేక్షకులు ఎక్కువగా రివ్యూలపై ఆధారపడతారు అనేది చాలావరకూ నిజం. అయితే పెద్ద సినిమాల వరకూ రివ్యూలతో సంబంధం లేకుండా కొందరు సినిమా చూస్తారు. కానీ చిన్న సినిమాలకు మాత్రం పాజిటివ్ రివ్యూలు రావడం చాలా ముఖ్యం. సినిమా గురించి తెలియకుండా అమెరికాలో ఎవరు థియేటర్ కు వెళ్తారు చెప్పండి? అయితే ఇక్కడ చిక్కేంటంటే చిన్న సినిమాలకు లాంగ్ రన్ ఉండడం లేదు. దీంతో మంచి టాక్ బయటకు వచ్చేలోపు థియేటర్లలో సినిమా నిలవదు. రిలీజ్ కు ముందే బజ్ ఉండి.. మంచి హైప్ క్రియేట్ చేస్తే పర్వాలేదు. అలాకాని పక్షంలో ఆ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు.

చిన్న సినిమాలను తక్కువ మొత్తానికి కొని మంచి లాభాలు దండుకోవచ్చు అనే ఆలోచనతో పంపిణీ చేస్తున్న చాలామంది పంపిణీదారులు ఈమధ్య తీవ్ర నష్టాలు చూడాల్సి వచ్చిందని.. ట్రేడ్ సంగతి తెలియక వేలు పెట్టిన కొత్తవారు కొందరు డబ్బు పోగొట్టుకొని లబోదిబో అంటున్నారు అని టాక్ వినిపిస్తోంది. అంటే భారీ బడ్జెట్ సినిమాలే కాదు. లో బడ్జెట్ సినిమాలు కూడా అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు గుదిబండలుగా మారాయన్నమాట.