Begin typing your search above and press return to search.

ఫ్లాపుల నెల ముద్ర వేయించుకున్న నవంబర్!

By:  Tupaki Desk   |   24 Nov 2019 6:29 AM GMT
ఫ్లాపుల నెల ముద్ర వేయించుకున్న నవంబర్!
X
నవంబర్ నెలను ఎక్కువమంది టాలీవుడ్ నిర్మాతలు అన్ సీజన్ గా పరిగణిస్తారు. అందుకే ఈ నెలలో క్రేజీ ప్రాజెక్టులు.. స్టార్ హీరోల సినిమాల రిలీజులు పెట్టుకోరు. అటు దసరా... ఇటు క్రిస్మస్ కు ఆ సినిమాలను విడుదల చేస్తారు. దీంతో నవంబర్ కు పెద్ద సినిమాల తాకిడి ఉండదు. అందుకే ఎక్కువగా చిన్న సినిమాలు ఈ నెలలో విడుదల అవుతాయి. నవంబర్ గురించి ఇండస్ట్రీలో ప్రచారంలో ఉన్న ఒక చేదు నిజం ఏంటంటే 'ఇక ఎలాగైనా వదిలించుకోవాలి' అనుకునే సినిమాలే ఎక్కువగా నవంబర్లో రిలీజ్ అవుతాయట. వీటితో పాటు కొన్ని సాధారణ సినిమాల విడుదల కూడా ఉంటుంది లెండి. నవంబర్ అన్ సీజన్ అనే అభిప్రాయానికి తగ్గట్టే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్స్ గా నిలిచాయి.

విజయ్ దేవరకొండ నిర్మాణం లో తెరకెక్కిన 'మీకు మాత్రమే చెప్తా' టార్గెట్ చిన్నదే అయినా అందుకోలేకపోయింది. '7 చేపల కథ' కు మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ తర్వాత కథ అడ్డం తిరిగింది. శ్రీవిష్ణు 'తిప్పరా మీసం' ఫ్లాప్ గా నిలిచింది. విశాల్ నటించిన 'యాక్షన్' కు స్పందన దక్కలేదు. విజయ్ సేతుపతి నటించిన 'విజయ్ సేతుపతి' సినిమాకూ కలెక్షన్స్ లేవు. 'తెనాలి రామకృష్ణ BA BL' సందీప్ కిషన్ ఖాతాలో మరో ఫ్లాప్ గా నిలిచింది. జ్యోతిక నటించిన 'జాక్ పాట్' ను కూడా ప్రేక్షకులు పట్టించుకో లేదు. ఇక ఈ శుక్రవారం విడుదలైన సినిమాలలో ఈషా రెబ్బా నటించిన 'రాగల 24 గంటల్లో'.. 'జార్జ్ రెడ్డి' కలెక్షన్స్ పరిస్థితి ఈ వీకెండ్ తర్వాత మనకు అర్థం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాల పరిస్థితి ఏమంత గొప్పగా అయితే లేదని టాక్ ఉంది.

ఇవి కాకుండా నవంబర్లో పలు చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి కానీ వాటిపై ప్రేక్షకులు ఆదరణ చూపలేదు. ఇప్పటివరకూ చూసుకుంటే నవంబర్ సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ నెలాఖరున విడుదల కానున్న సినిమాల్లో నిఖిల్ 'అర్జున్ సురవరం'.. గౌతమ్ మీనన్-ధనుష్ 'తూటా' ఉన్నాయి. ఇవి పలు వాయిదాల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలు. మరి ప్రేక్షకుల ను ఈ సినిమాలు ఎంత మాత్రం మెప్పిస్తాయో వేచి చూడాలి.