Begin typing your search above and press return to search.

బెదిరించ‌డం లేదు.. అగ్ర‌నిర్మాతపైనేనా ఆ కామెంట్?

By:  Tupaki Desk   |   8 July 2021 4:38 AM GMT
బెదిరించ‌డం లేదు.. అగ్ర‌నిర్మాతపైనేనా ఆ కామెంట్?
X
క‌రోనా మ‌హ‌మ్మారీ రెండేళ్లుగా వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. అన్ని రంగాల‌ను దెబ్బ తీసిన మ‌హ‌మ్మారీ సినీరంగాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ రంగంలో కార్మికుల‌కు ఉపాధి క‌రువైంది. ఇక థియేట‌ర్ల రంగం పూర్తిగా కోలుకోలేని స‌న్నివేశంలోకి వెళ్లిపోయింది. అస‌లే క‌ష్టాల్లో ఉన్న ఈ రంగానికి క‌రోనా అతి పెద్ద దెబ్బ‌గా మారింది.

మ‌హ‌మ్మారీ రంగ ప్ర‌వేశంతో అంతా మారిపోయింది. థియేట‌ర్లు ఏడాదిన్న‌రగా బంద్ అవ్వ‌డంతో ఓటీటీ-బుల్లితెర‌- డిజిట‌ల్ రంగాలు హ‌వా సాగిస్తున్నాయి. అనూహ్యంగా ఓటీటీ రంగం ఊపందుకుంది. క్రేజు ఉన్న సినిమాల‌ను ఓటీటీలు భారీ మొత్తాల్ని చెల్లించి కొనేసేందుకు ముందుకు వ‌స్తుండ‌డంతో ఎగ్జిబిష‌న్ రంగానికి అది పెద్ద దెబ్బ‌గా మారింది. ఇప్పుడు ఈ విష‌యంపై ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారులు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు.

చిన్నా చిత‌కా నిర్మాత‌లు న‌ష్ట పోకుండా ఓటీటీల‌కు త‌మ సినిమాల‌ను అమ్ముకున్నారంటే అర్థం ఉంది కానీ అగ్ర నిర్మాత‌లు పెద్ద సినిమాల‌ను ఓటీటీల‌కు విక్ర‌యించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల డి.సురేష్ బాబు నార‌ప్ప చిత్రం ఓటీటీల్లో వ‌చ్చేస్తోంది అంటూ ప్ర‌చారం సాగ‌డంతో దీనిపై ఎగ్జిబ‌ట‌ర్ కం డిస్ట్రిబ్యూట‌ర్ సునీల్ నారంగ్ తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. మీడియా ముఖంగా ఆయ‌న త‌న ఆవేదనను వ్య‌క్తం చేశారు. చిన్న‌వాళ్లు అమ్ముకుంటే స‌రే కానీ పెద్ద నిర్మాత‌లు ఇలా చేస్తారా? అంటూ నారంగ్ ప్ర‌శ్నించారు. ప‌రోక్షంగా సురేష్ బాబును ఆయ‌న నిల‌దీశారు.

తానూ నిర్మాత‌నేన‌ని నిర్మాత‌ల క‌ష్టాలు త‌న‌కు కూడా తెలుస‌ని నారంగ్ అన్నారు. అయితే పంపిణీదారులు థియేట‌ర్ య‌జ‌మానుల బాధ‌ల్ని త‌ర‌చి చూడాల‌ని వారి గురించి ఆలోచించి సినిమాల్ని ఓటీటీల‌కు అమ్ముకోవ‌ద్ద‌ని సూచించారు. తాను బెదిరించ‌డం లేద‌ని అర్థం కావాల‌నే చెబుతున్నాన‌ని అన్నారు. దయచేసి సినిమాను కాపాడండి.. థియేటర్లను కాపాడండి! అని నారంగ్ నిన‌దించారు.

అక్టోబర్ 30 వరకు తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముకోవద్దని సునీల్ నారంగ్ వేడుకున్నారు. ఆ తరువాత పరిస్థితులు బాగా లేకపోతే డిజిట‌ల్ - ఓటీటీల‌కు మీ సినిమాల‌ను క‌ట్ట‌బెట్టుకోండి అని సూచించారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో వంద శాతం ఆక్యుపెన్సీతో.. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తులున్నాయి. కానీ ఎవ‌రూ థియేట‌ర్లు తెరిచేందుకు ముందుకు రావడం లేదు. ఏపీలో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య పై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ ని సంప్ర‌దించినా అట్నుంచి స‌రైన రెస్పాన్స్ లేదు. టిక్కెట్టు ధ‌ర‌ల పెంపుపై జ‌గ‌న్ స‌ర్కార్ వెనక్కి త‌గ్గ‌డం లేద‌ని తెలిసింది. దీంతో ఇప్పుడు ఎగ్జిబిష‌న్ రంగం పూర్తిగా చిక్కుల్లో ప‌డుతోంది. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి అయినా ప‌రిస్థితి మారుతుందనే అంతా ఆశిస్తున్నారు. అందుకే నారంగ్ అప్ప‌టివ‌ర‌కూ డెడ్ లైన్ విధించార‌ని భావిస్తున్నారు. కానీ ఈలోగానే చాలా సినిమాల్ని ఓటీటీల‌కు అమ్ముకునేందుకు నిర్మాత‌లు సంసిద్ధంగా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.