Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు జక్కన్న వరమా? శాపమా?

By:  Tupaki Desk   |   22 Dec 2021 11:04 AM IST
టాలీవుడ్ కు జక్కన్న వరమా? శాపమా?
X
అవును.. ఎస్.ఎస్. రాజమౌళి అద్భుతమైన దర్శకుడు. ఆయన దర్శకత్వ ప్రతిభను ఎవరు తప్పు పట్టటం లేదు. ఆ మాటకు వస్తే.. ఆయన్ను విమర్శించటం కూడా మా ఉద్దేశం కాదు. ఎంతటి మేధావి అయినప్పటికీ.. సదరు వ్యక్తిలో లోపాలు ఉండవనుకోవటం ఎంత తప్పో.. రాజమౌళి చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించకపోవటం కూడా అంతే పెద్ద తప్పు అవుతుంది.

ఎంతసేపటికి తన సినిమా.. తన విజయం.. తన కలెక్షన్లు మాత్రమే కాదు.. టాలీవుడ్ గురించి.. దాని మీద ఆధారపడి బతుకుతున్న వేలాది మంది గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన సినిమాను అత్యద్భుతమైన దర్శకుడు తీయటం ద్వారా.. టాలీవుడ్ కు మాత్రమే కాదు.. దేశ సినీ పరిశ్రమకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించొచ్చు.కాదనలేం. కానీ.. అందుకు ఎంతమంది బలిదానాలు చేయాలి? మరెంత మంది నష్టపోవాలి? అన్నదిక్కడి ప్రశ్న.

ఒక అద్భుతమైన సినిమాను తీయటం కోసం.. యావత్ పరిశ్రమ త్యాగాలు చేయాల్సిన పరిస్థితి రావటం దేనికి నిదర్శనం? ఇదెక్కడి కల్చర్. మరింత వివరంగా చెప్పాలంటే.. ఒక పెద్ద కంపెనీ ప్రయోజనం కోసం వేలాది మంది సామాన్యులు సమిధలుగా మారితే ఒప్పుకుంటామా? ఆ తీరును తప్పు పడతాం కదా? అలాంటప్పుడు రాజమౌళి వ్యవహరించే తీరును కూడా అంతే స్థాయిలో తప్పు పట్టాలి కదా?

బాహుబలి పేరుతో ఆయన తీసిన రెండు భాగాల సినిమాకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలిసిందే. దాని కారణంగా టాలీవుడ్ కు ఎక్కడ లేనంత గుర్తింపు వచ్చింది సరే. కానీ.. ప్రభాస్ లాంటి ఒక హీరోను అన్నేళ్లు బ్లాక్ చేయటం వల్ల మిగిలిన నిర్మాతలకు జరిగిన నష్టం మాటేమిటి? అది కూడా వదిలేద్దాం. అదో ప్రయోగం అనుకుందాం. తాజా ఆర్ఆర్ఆర్ సంగతే చూద్దాం. ఇండస్ట్రీలో పేరున్న ఇద్దరు పెద్ద హీరోలు (తారక్.. చరణ్) ఇద్దరి డేట్లను పూర్తిగా బ్లాక్ చేసేశారు.

తారక్ విషయానికి వస్తే.. ఆయన నటించిన చివరి చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. విడుదలైంది 2018 అక్టోబరు 11న. అంటే.. దాదాపు మూడు సంవత్సరాల మూడు నెలలు. ఇందులో కరోనా ఖాతాలోకి ఒక ఏడాదిని తీసేద్దాం. నికరంగా రెండేళ్ల మూడు నెలల కాలం నుంచి ఒక్క ఆర్ఆర్ఆర్ కోసం పని చేస్తున్నారు. ఇక.. రాంచరణ్ తేజ్ విషయానికి వద్దాం. అతను నటించిన చివరి చిత్రం.. ‘వినయ విధేయ రామ’. ఈ మూవీ విడుదలైంది 2019 జనవరి 11న. అంటే.. ఆర్ఆర్ఆర్ విడుదలకు మూడేళ్లు. ఇక్కడ కూడా కరోనా ఖాతాలో ఏడాదిని తీసేద్దాం. మిగిలింది రెండేళ్లు.

అంటే.. ఇద్దరు పేరున్న పెద్ద హీరోలను సరాసరిన రెండేళ్ల పాటు బ్లాక్ చేయటం ద్వారా ఆర్ఆర్ఆర్ అనే అద్భుత కావ్యాన్ని రాజమౌళి తీశారని అనుకుందాం. దాని వల్ల ఆయనకు.. ఆయన నిర్మాతకు లాభం తప్పించి.. టాలీవుడ్ కు కలిగే ప్రయోజనం ఏముంది? ఒకవేళ జక్కన్న ఆర్ఆర్ఆర్ ను ఏడాదిలో తీశారనే అనుకుందాం.

ఈ ఇద్దరు హీరోలు కనీసం ఒక్కొక్కరు ఒక్కో సినిమా అదనంగా చేసే వారు కదా? ఒకపెద్ద హీరో సినిమా అంటే ఎన్ని వేల మందికి పని దొరుకుతుందో తెలిసిందే కదా? ఈ లెక్కన చూసినప్పుడు రాజమౌళి కారణంగా టాలీవుడ్ కు నష్టం జరుగుతుందా? లాభం చేకూరుతుందా? అన్నది ప్రశ్న.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు భారీగా తీసిన జక్కన్న సినిమా కూడా మిగిలిన సినిమాల వారు త్యాగాలు చేయాలి. తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఆ సందర్భంగా కనీసం మూడు.. నాలుగు సినిమాలైనా విడుదల కావాలి. ఒక సినిమా బాగోకపోయినా.. మరో సినిమాను చూసే ఆప్షన్ ప్రేక్షకులకు ఉండాలి. కానీ.. ఇప్పుడు జక్కన్న అండ్ కో వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఆర్ఆర్ఆర్ మినహా మరే సినిమా విడుదలయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

సంక్రాంతి రేసులో ఉంటాయనుకున్న పవన్ కల్యాణ్ బీమ్లానాయక్.. ప్రభాస్ రాథేశ్యామ్ సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడ్డాయి. ఇవి మార్చిలో అంటున్నారు. ఆ టైంకు కరోనా మూడో వేవ్ అంటున్నారు. ఒకవేళ అది కూడా ఉండదనే అనుకుందాం. విద్యార్థులకు పరీక్షల టైం. ఆ వేళలో సినిమాలు విడుదలైతే చూసే జోష్ ఉంటుందా? ఒకవేళ ఉన్నా.. అదేదీ సంక్రాంతి వేళలో ఉండే పండుగ సందడి వాతావరణం ఉండదు. ఒక సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసి.. దాని కోసం వందల కోట్లు ఖర్చు పెట్టినందుకు బదులుగా అటు చిత్ర పరిశ్రమ.. ఇటు ప్రేక్షకులు మూల్యం చెల్లించాలి. ఇదెక్కడి న్యాయం.

ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. చిన్న సినిమాలు ఎన్ని విడుదలైనా.. ఒక పెద్ద సినిమా విడుదల వేళలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. ఈ విషయం మొన్న విడుదలైన అఖండ.. తాజాగా విడుదలైన పుష్ప మూవీలు చెప్పేశాయి. ఈ సినిమాల విడుదల సందర్భంగా కొన్నిచోట్ల ట్రాఫిక్ జాంలు చోటు చేసుకున్నాయి.

సినిమా థియేటర్లు కళకళలాడిపోయాయి. అలాంటప్పుడు ఒక భారీ సినిమా కోసం మరికొన్ని పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేసుకోవటం జక్కన్న అండ్ కోకు లాభం చేకూరుతుందే తప్పించి.. మరెవరికీ కాదన్నది నిజం. అలాంటప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు జక్కన్న వరమా? శాపమా?