Begin typing your search above and press return to search.

విశాఖ‌కే ప‌రిమితం కాదు.. మ‌రో రెండు న‌గ‌రాల్లోనూ స్టూడియోలు

By:  Tupaki Desk   |   13 Feb 2022 1:30 AM GMT
విశాఖ‌కే ప‌రిమితం కాదు.. మ‌రో రెండు న‌గ‌రాల్లోనూ స్టూడియోలు
X
తాజాగా మెగాస్టార్ నేతృత్వంలోని బృందంతో సీఎం జ‌గన్ జ‌రిపిన చ‌ర్చ‌ల్లో కీల‌క‌మైన అంశం.. ఆదాయం ఎక్కువ‌గా ఇస్తున్న ఏపీ విష‌యంలో సినీరంగం అనుస‌రిస్తున్న తీరును ఎండ‌గ‌ట్ట‌డం. అంతేకాదు... 20 శాతం షూటింగులు ఏపీలోనే చేయాల‌ని ఆయ‌న దాదాపు నిర్దేశించారు. దీనికి విశాఖ‌ను ఎంచుకున్న విష యం తెలిసిందే. అయితే.. తాజాగా ప్ర‌భుత్వం మ‌రో కొత్త ప్ర‌తిపాద‌న‌ను కూడా తెర‌మీదికి తెచ్చింది. దీనిని బ‌ట్టి.. మ‌రో రెండు న‌గ‌రాల‌కు కూడా సినిమా ఇండ‌స్ట్రీని విస్త‌రించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

దీనిలో భాగంగా విశాఖతోపాటు రాష్ట్రంలోని రెండు నగరాల్లో సినీ స్టూడియోల నిర్మాణాకి ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. దీనికోసం విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాలను ఎంపిక చేసారు. ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా.. మూడు నగరాల్లోనూ స్టూడియోల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వ తాజా నిర్ణయం. ఇందు కోసం భూ సేకరణ పైన ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా భూనిధి ఏర్పాటు చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

సినిమా షూటింగులు, సినిమా స్టూడియోల నిర్మాణం కోసం ఈ భూములను వినియోగించనున్నారు. తొలుత విశాఖలో పరిశ్రమ ఏర్పటు గురించి ప్రతిపాదనలు చేయగా.. ఇప్పుడు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, రాయలసీమలో సినీ పరిశ్రమ కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్ టిక్కెట్ బాధ్యతలను చలనచిత్ర అభివృద్ధి సంస్థకు అప్పగించిన ప్రభుత్వం.. ఈ భూముల బాధ్యతలను దీని ద్వారానే నిర్వహించాలని భావిస్తోంది.

ఇందు కోసం ఈ మూడు నగరాల నుంచి భూ సేకరణ పూర్తయిన తరువాత వాటిని సంస్థకు బదిలీ చేసి..అక్కడ నుంచి నిర్మాణం-నిర్వహణ-బదిలీ(బీఓటీ) విధానంలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు బిడ్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. మరోవైపు ప్రైవేటుగా స్టూడియోలు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే స్టూడియోలు నిర్మించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

దీంతోపాటు సీఎం - సినీ ఇండస్ట్రీ మధ్య జరిగిన సమావేశంలో టికెట్ ధరల పైన ఒక అంగీకారం జరిగిన‌ట్టు స‌మాచారం. ప్రభుత్వం నియమించిన కమిటీ ధరల మీద నివేదిక ఈ నెల 17వ తేదీన అందించనుంది. దీని ఆధారంగా ఈ నెలాఖరులోగా టికెట్ ధరలు...అయిదో షో ప్రదర్శనకు వీలుగా సమయం ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయనుంది. అయిదు షోలకు సంబంధించి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఈ అయిదు షోల ప్రదర్శన ఉండేలా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.