Begin typing your search above and press return to search.

భార‌తీయుల్లా విదేశీయులు న‌టించ‌లేరుః సీనియ‌ర్ న‌టుడు

By:  Tupaki Desk   |   1 April 2021 5:00 AM IST
భార‌తీయుల్లా విదేశీయులు న‌టించ‌లేరుః సీనియ‌ర్ న‌టుడు
X
ఇండియ‌న్స్ సినిమాను లార్జ‌ర్ దేన్ లైఫ్ గా భావిస్తారని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ అన్నారు. హైద‌రాబాద్ లో ‘ది ప‌వ‌ర్ ఆఫ్ పాజిటివిటీ’ పేరుతో ఫిక్కీ ఫ్లో ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అనుపమ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలిపారు. త‌న ‌జీవితంలో బోర్ ఫీల‌వ‌డం, మూడ్ బాగోలేద‌నే సంద‌ర్భాలు ఉండ‌నే ఉండ‌వ‌న్నారు. తానెప్పుడూ జీవితాన్ని ఆస్వాదిస్తాన‌ని, ర‌క‌ర‌కాల మ‌నుషుల‌ను క‌ల‌వ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పారు.

ఇక‌, తాను జీవితంలో ఎన్నో క‌ఠిన ప‌రిస్థితులు ఎదుర్కొన్నాన‌ని తెలిపారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో అవ‌కాశాలు రాక రైల్వే ప్లాట్ ఫాం మీద ప‌డుకున్నానని తెలిపారు ఈ లెజండరీ యాక్ట‌ర్‌. ముంబైలో చిన్న చిన్న ప‌నులు చేసుకుంటూ జీవితాన్ని కొన‌సాగించిన‌ట్టు చెప్పారు. మ‌హేష్ భ‌ట్ సినిమాలో అవ‌కాశం వ‌చ్చిన త‌ర్వాత త‌న క‌ష్టాలు త‌గ్గాయ‌ని వెల్ల‌డించారు.

ఇక‌, భార‌తీయ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇక్క‌డ కూడా మంచి సినిమాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. భార‌తీయులు సినిమాను లార్జ‌ర్ దేన్ లైఫ్ గా భావిస్తార‌ని చెప్పారు. ఇక్క‌డి న‌టీన‌టులు పోషించే కొన్ని పాత్ర‌ల‌ను విదేశీ న‌టులు పోషించ‌లేర‌ని చెప్పారు. ఇక‌, తెలుగులో ‘త్రిమూర్తులు’ తన మొదటి చిత్రమన్న అనుపమ్ ఖేర్.. త్వరలో కార్తికేయ-2 సినిమాలో నటించబోతున్నట్టు తెలిపారు.