Begin typing your search above and press return to search.

'సౌత్ స్టార్స్ పై నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు'

By:  Tupaki Desk   |   28 April 2022 12:30 PM GMT
సౌత్ స్టార్స్ పై నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు
X
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ - బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మధ్య బుధవారం ట్విట్టర్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు అనే సుదీప్ వ్యాఖ్యలపై అజయ్ స్పందిస్తూ.. హిందీ ఎప్పటికీ జాతీయ భాషే అని ట్వీట్ చేశారు. దీనికి సుదీప్ కూడా రియాక్ట్ అయి హిందీ హీరోకి పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇష్యూలో ట్విట్టర్ వేదికగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు.

''అజయ్ దేవగన్ చేసిన హిందీ ట్వీట్ కి మీరు (సుదీప్) కన్నడలో సమాధానం ఇస్తే ఏమిటనే మీ ప్రశ్న కంటే ఏదీ మెరుగ్గా చెప్పలేము.. దక్షిణాది లేదా ఉత్తరాది అనేవి లేవు.. భారతదేశం మొత్తం ఒక్కటేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను'' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

అనంతరం ''అజయ్ దేవగన్.. మీరు నాకు చాలా కాలంగా వ్యక్తిగతంగా తెలుసు. కొందరికి అనిపించే విధంగా మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని నాకు తెలుసు. ప్రాంతీయత, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలనేవి వృద్ధి చెందాయి. భాష.. ప్రజలు చేరువ కావడానికి దోహదపడుతుంది. విడదీయడానికి కాదు అని నేను నమ్ముతాను'' అని మరో ట్వీట్ చేశారు వర్మ.

''మీరు ఉద్దేశపూర్వకంగా అన్నారో లేదో.. మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు సంతోషిస్తున్నా. బాలీ(నార్త్)వుడ్ - శాండల్(సౌత్)వుడ్ మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు కనిపిస్తున్న సమయంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు. సుదీప్ సార్.. నార్త్ స్టార్స్ అభద్రతాభావంతో ఉన్నారని.. సౌత్ స్టార్స్ పట్ల అసూయతో ఉన్నారనేది కాదనలేని నిజం. ఎందుకంటే ఒక కన్నడ డబ్బింగ్ చిత్రం 'కేజీఎఫ్ 2' ఓపెనింగ్ డే నాడు 50 కోట్లు సాధించింది''

''మనమందరం రాబోయే హిందీ చిత్రాల ఓపెనింగ్ డే లను చూడబోతున్నాం. 'రన్ వే 34' ఓపెనింగ్ కలెక్షన్స్ బాలీవుడ్ లో బంగారం ఉందా? లేదా కన్నడలో బంగారం ఉందా? అనేది.. అజయ్ - సుదీప్ ల మధ్య విన్నర్ ని రుజువు చేస్తుంది" అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. వివాదాస్పద దర్శకుడు చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు బాలీవుడ్ జనాలను కలవరపెడుతున్నాయి.

ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో సుదీప్ చేసిన కామెంట్స్ తో ఈ వివాదం చెలరేగింది. "కన్నడ సినీ పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలు చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ అందులో నిజం లేదు. పాన్ ఇండియా స్థాయి అని కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని అలరించేలా.. మనం సినిమాలు తీస్తున్నాం. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు''

''హిందీ వారే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందిస్తున్నారు. తమ సినిమాలను తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినా సక్సెస్ సాధించలేకపోతున్నారు" అని సుదీప్ అన్నారు. ఈ వ్యాఖ్యల పై అజయ్ దేవగణ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

"సోదరా.. మీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరెందుకు మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు. జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది. జనగణ మన'' అని అజయ్ దేవగన్ పేర్కొన్నారు. దీనికి సుదీప్ కౌంటర్స్ వేశారు.

''అజయ్ సార్.. మీకు మరో విధంగా అర్ధమైందనుకుంటా. నేను ఎవరినీ కించపరిచేందుకు అలా చేయలేదు. మన దేశ భాషలన్నింటిపైనా నాకు గౌరవం ఉంది. మేం హిందీని గౌరవించాం.., నేర్చుకున్నాం. అందుకే మీరు హిందీలో చేసిన ట్వీట్ ను నేను చదవగలిగాను. అదే నేను రెస్పాన్స్ కన్నడలో ఇస్తే పరిస్థితి ఏంటి సార్? మీరు చదవగలరా. కాబట్టి ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలా జరుగుతుంటుంది" అని సుదీప్ పేర్కొన్నారు.

హిందీ భాష ప్రాముఖ్యతపై స్టార్ హీరో అజయ్ దేవగన్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మొత్తం సైలెంట్ గా ఉండిపోయింది. ఇక అజయ్ హిందీని జాతీయ భాష అని పేర్కొన్నప్పటికీ.. భారత రాజ్యాంగం హిందీని అధికారిక భాషగా ఉంటుందని మాత్రమే పేర్కొంది.. కానీ ఏ భాషనూ జాతీయ భాషగా ఎంపిక చేయలేదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు అజయ్ కు కౌంటర్లు వేస్తున్నారు.