Begin typing your search above and press return to search.
హీరోపై నాన్ బెయిలబుల్ వారంట్.. పరారీ
By: Tupaki Desk | 7 Oct 2017 8:30 AMఒక హీరోపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ కావడం అంటే చిన్న విషయమేమీ కాదు. కానీ చిన్న విషయాన్నే హీరోలు ఒక్కోసారి పెద్దది చేసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్.. కోర్టుకు హాజరు కావడం చిన్న విషయంగా ఆయా హీరోలు భావించకపోవచ్చు. ఇప్పుడు తమిళ హీరో జై పరిస్థితి ఇలాగే ఉంది.
జర్నీ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరో జై. ఆ తర్వాత ఇతడి సినిమాలకు ఇక్కడ పెద్దగా ఆదరణ దక్కకపోయినా.. తెలుగమ్మాయి అంజలి లవర్ గా జై కు ఇక్కడ గుర్తింపు మాత్రం బాగానే ఉంది. రీసెంట్ గా ఇతడు ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నాడు. ఫుల్లుగా తాగేసి డ్రైవ్ చేస్తూ.. చెన్నైలో ఓ డివైడర్ ను ఢీ కొట్టడంతో.. ఇతడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టుకు లాగారు. బుధవారం నాడు కోర్టు హియరింగ్ ఉండగా.. ఆ రోజున కోర్టుకు వచ్చాడు జై. కానీ గురువారం కూడా రావాలని జడ్జ్ ఆదేశించగా.. ఆ ఆదేశాలను జై పట్టించుకోలేదు. దీంతో అతడిని తీసుకువచ్చి హాజరు పరచాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది.
కానీ జై అందుబాటులో లేడని పోలీసులు కోర్టుకు తెలపడంతో.. మెట్రోపాలిటన్ కోర్టు జై పై నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ చేసింది. దీంతో జై కు పరారీ కాక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. ఈ వారంట్ ను కోర్ట్ రీకాల్ చేసేవరకూ అమలులో ఉండనుండగా.. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కోవడం.. జైకు గత మూడేళ్లలో ఇది రెండోసారి. ఇతడి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయాల్సిందిగా కూడా చెన్నై పోలీసులు కోర్టుకు విన్నవించారు.