Begin typing your search above and press return to search.

కామెంట్‌: ప్రతిసారీ ఐటెమ్‌ వర్కవుటవ్వదు

By:  Tupaki Desk   |   8 Sep 2015 8:05 PM GMT
కామెంట్‌: ప్రతిసారీ ఐటెమ్‌ వర్కవుటవ్వదు
X
ఫార్ములా వెంటపడడం మనవాళ్లకు అలవాటైన వ్యవహారమే. సక్సెస్‌ కొట్టిన సినిమాలో ఏ ఫార్ములా ఉందో తెలుసుకుని దాని ప్రకారమే కథలు రాసుకునేవాళ్లున్నారు. అందుకే తెలుగు సినిమా కథల్లో మోనోటనీ అనేది ఫిక్స్‌డ్‌ గా ఉంటుంది. పాత కథల్నే కొత్తగా తిప్పి రాసేస్తూ ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఎలా నడిపించాలో ఆలోచిస్తుంటారు. వీటికి ఐటెమ్‌ పాట అనే మసాలాని దట్టించి ఇటీవలి కాలంలో హిట్లు అందుకున్నారు. అయితే టాలీవుడ్‌ పై బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ హిట్టయిన సినిమాల్లో ఏ ఫార్ములాని అనుసరిస్తే అదే ఫార్ములాని మన దర్శకరచయితలు కాపీ చేసేస్తుంటారు.

అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్‌ లో సీను అంతా రివర్సులో ఉంది. ప్రత్యేకించి ఐటెమ్‌ నంబర్లు అనేవి కనిపించడం లేదు. కేవలం కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలే తెరకెక్కుతున్నాయక్కడ. ఈ ఏడాదిలో రిలీజై హిట్‌ కొట్టిన ఎన్‌.హెచ్‌10 - పికూ - తను వెడ్స్‌ మను - బేబి - దిల్‌ ధడ్కనే దో - భజరంగి భాయిజాన్‌ చిత్రాల్లో అసలు ఐటెమ్‌ నంబర్లే లేవు. కానీ ఇవన్నీ సూపర్‌ హిట్‌ చిత్రాలు. అదే తరహాలో నవతరం హీరోలు నటించిన బద్లాపూర్‌ - ఎబిసిడి 2 - ధమ్‌ లగా కే హైసా.. ఐటెమ్‌ లు పెట్టి నడిపించే పనిలేకుండా హిట్టయ్యాయి.

భారీ సినిమాలు బ్రదర్స్‌ లో కరీనా ఐటెమ్‌ ఆకట్టుకోలేదు. తేవర్‌ లో శ్రుతి ఐటెమ్‌ బావున్నా సినిమా ఆడలేదు. .. ఇవన్నీ విశ్లేషించి ఐటెమ్‌ ల వల్ల ఖర్చు అదనంగా పెరుగుతుంది తప్ప వీటివల్ల ప్రయోజనం లేదు. దానికంటే కథని నమ్ముకుని సినిమా చేస్తేనే అదనపు ఖర్చు తగ్గుతుంది అని విశ్లేషిస్తున్నారు. అంటే సినిమాకి మునుముందు మంచి రోజులు రాబోతున్నాయనే దీనర్థం.