Begin typing your search above and press return to search.

రంగమార్తాండ.. అసలేం జరుగుతోంది కేవీ?

By:  Tupaki Desk   |   28 Sep 2021 9:30 AM GMT
రంగమార్తాండ.. అసలేం జరుగుతోంది కేవీ?
X
గులాబి, నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం లాంటి డిఫరెంట్‌ చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌‌ అని బిరుదు కొట్టేసిన కృష్ణవంశీ.. ఆ తర్వాత రొటీన్ కాన్సెప్టులతో బోరు కొట్టించి బాగా వెనకబడ్డాడు. చాలా గ్యాప్ తర్వాత ‘రంగమార్తాండ’ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఎంత ఫెయిల్యూర్స్లో ఉన్నా అతని టేకింగ్‌పై తెలుగు ప్రేక్షకులకి మంచి ఇంప్రెషన్‌ ఉండటంతో ఆనందపడ్డారు. అందులోనూ మరాఠీలో సక్సెస్ అయ్యి అవార్డులు, రివార్డులు అందుకున్న ‘నటసామ్రాట్’ చిత్రానికి రీమేక్‌ కావడంతో అంచనాలు పెంచుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో తెలీక ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

రంగమార్తాండ మొదలై చాలా కాలమే అయ్యింది. ఇళయరాజాతో మ్యూజిక్ సిట్టింగులు.. లీడ్ యాక్టర్స్ అయిన ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలతో లొకేషన్‌ ఫొటోలు నెట్‌లో షేర్‌‌ చేసి అందరిలో ఆసక్తి పెంచేశాడు కేవీ. దాంతో సినిమా పనులు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి అనుకున్నారంతా. కానీ లాక్‌డౌన్ పూర్తయ్యి అన్ని సినిమాలూ సెట్స్కి పరిగెత్తినా.. త్వరత్వరగా షూటింగులు పూర్తి చేసుకుని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నా ఈ సినిమా గురించి ఒక్క వార్త కూడా రాలేదు. రీసెంట్‌గా ఎవరో సోషల్ మీడియాలో కదిలిస్తే, డిసెంబర్‌‌లో రిలీజ్ చేస్తానని చెప్పాడు కృష్ణవంశీ. కానీ అది కూడా అనుమానమే. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికి తిరిగి స్టార్టయ్యింది. ఎట్టకేలకి షూట్‌ని రీస్టార్ట్ చేశామని.. ఇళయరాజా కంపోజ్ చేసిన ఓ అద్భుతమైన పాటను శివాత్మిక, రాహుల్‌ సిప్లిగంజ్‌లపై తీశామని ఇవాళ ట్విటర్‌‌లో చెప్పాడు కేవీ. దాంతో మళ్లీ అనుమానాలు స్టార్టయ్యాయి.

నిజానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా చాలా వర్క్‌ పెండింగ్‌లో ఉందట. రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్ చేతినిండా సినిమాలతో బిజీ అయిపోవడంతో మిగతా ఆర్టిసుల సీన్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ కూడా బాగా బిజీగా ఉండటంతో ఈ సెట్లో ఇంకా జాయినవలేదని సమాచారం. మరోవైపు యాక్షన్ ఎంటర్‌‌టైనర్స్కి కేరాఫ్ అయిన కృష్ణవంశీ ఇలాంటి ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని హ్యాండిల్ లేక సతమతమవుతున్నాడనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇలా అయితే షూటింగ్‌కి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కానీ తనేమో డిసెంబర్‌‌లో రిలీజ్ చేసేస్తానంటున్నాడు. అంటే సినిమాని కంప్లీట్ చేయడానికి రెండే రెండు నెలలు ఉంది. ఇంతవరకు నత్తనడకన సాగిన పనులు రెండు నెలల్లో పూర్తయిపోతాయా అనేది పెద్ద సందేహం. పైగా దీని తర్వాత ‘అన్నం’ అనే సినిమా చేస్తానంటూ ఆమధ్య అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు కృష్ణవంశీ. మరి రంగమార్తాండని ఎప్పుడు పూర్తి చేస్తాడో.. అన్నం కథని ఎప్పుడు వండుతాడో.. ఆయనకే తెలియాలి.