Begin typing your search above and press return to search.

మల్టి ప్లెక్సులు ఒకే మాట..సింగిల్ స్క్రీన్స్ అలా కాదు!

By:  Tupaki Desk   |   18 May 2020 8:00 AM IST
మల్టి ప్లెక్సులు ఒకే మాట..సింగిల్ స్క్రీన్స్ అలా కాదు!
X
కరోనా క్రైసిస్ తో పలు రంగాలలో మార్పులు వస్తున్నాయి. సినిమా ఎగ్జిబిషన్ రంగం కూడా ఓ కుదుపుకు గురయింది. సినిమా థియేటర్లు మూతపడడంతో రిలీజులు ఆగిపోయాయి. థియేటర్లు రీ ఓపెన్ చేసిన తర్వాతే సినిమా రిలీజులు చేస్తామంటే థియేటర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇంతలో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఆప్షన్ రావడంతో ఎగ్జిబిటర్లకు షాక్ తగిలింది.

ఇప్పటికే కొందరు నిర్మాతలు ఓటీటీ రిలీజులకు మొగ్గు చూపుతున్నారు. హిందీలో అయితే స్టార్ హీరోల సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజుకు సిద్ధం అవుతున్నాయి. దీంతో ఓటిటి లో డైరెక్ట్ రిలీజ్ కి వ్యతిరేకంగా అన్ని పెద్ద మల్టీప్లెక్స్ చైన్లుఒక మాట మీదకి వచ్చాయి. ఇలా ఓటీటీ లో డైరెక్ట్ రిలీజ్ చేయడం సరికాదని తేల్చిచెప్పాయి. దేశవ్యాప్తంగా మల్టిప్లెక్స్ ఆపరేటర్లు అందరూ ఇలా ఒక్క మాట మీద ఉన్నారు కానీ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లలో ఆ ఐకమత్యం కనిపించడం లేదు.

ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ పరిస్థితి కనపడుతోంది. సౌత్ లో మల్టి ప్లెక్సుల కంటే సింగిల్ స్క్రీన్ల వల్లే మెజారిటీ రెవెన్యూ వస్తుంది. అయితే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు తమ థియేటర్లను నిర్మాత అదుపులో ఉంచడంతో వీరందరూ ఓటీటీ రిలీజుకు వ్యతిరేకంగా గళమెత్తలేకపోతున్నారు. ఓటీటీ రిలీజుల కారణంగా థియేటర్లకు ఆదాయం తగ్గిపోతుందనేది వాస్తవమే. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది అటు ఎగ్జిబిటర్లు.. ఇటు సినిమావాళ్లు అన్వేషిస్తే బాగుంటుంది లేకపోతే రాను రాను గడ్డు పరిస్థితులు చూడాల్సి రావచ్చు.