Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో 'నో థియేట‌ర్స్ ఫ‌ర్ డ‌బ్బింగ్ మూవీస్' పద్ధతి రాబోతోందా..?

By:  Tupaki Desk   |   20 April 2020 8:00 AM IST
టాలీవుడ్ లో నో థియేట‌ర్స్ ఫ‌ర్ డ‌బ్బింగ్ మూవీస్ పద్ధతి రాబోతోందా..?
X
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 రోజు రోజుకి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిపోయింది. కరోనా ప్రభావం అన్ని రంగాల మీద తన ప్రభావాన్ని చూపించింది. దీని వలన కలిగిన నష్టం అంచనా వేయలేని స్థితికి చేరింది. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. దీని నుండి ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో ఇప్పట్లో సినిమా బయటకి వచ్చే అవకాశం లేదని ఒక అంచనాకి వస్తున్నారు.

లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత టాలీవుడ్ పరిస్థితి ఏమిటని ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నారు. తెలుగు సినిమాని బ్రతికించుకోవడానికి మార్గాలను వెతుకుతున్నారు. నిర్మాతలని ఎలా గట్టెక్కించడానికి నష్ట నివారణ చర్యల గురించి ఇప్పటికే పలు దపాలు చర్చలు కూడా జరిపారట. ఈ నేపథ్యంలో కొంతమంది సినీ పెద్దలు మన తెలుగు సినిమా గట్టెక్కేలంటే డబ్బింగ్ చిత్రాలను ఇక్కడ థియేటర్లు ఇవ్వకుండా ఉంటే కొంతమేర నష్టం జరగకుండా చేసుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారట. ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా డిస్ట్రీబ్యూట‌ర్లు - ఎగ్జీబిట‌ర్లు - థియేట‌ర్స్ ఓన‌ర్స్ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌ణ చేయాల్సిందిగా ఒత్తిడి స్టార్ట్ చేసిన‌ట్లుగా సమాచారం. తెలుగు ఇండ‌స్ట్రీ కోలుకునే వ‌రుకు ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న‌ట్లు సమాచారం.

అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తెలుగు సినిమాకే మొద‌టి ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. ఈ ప‌ద్ధ‌తి ఇండ‌స్ట్రీలో కరోనా కార‌ణంగా జ‌రిగిన న‌ష్ట నివార‌ణ అయ్యే వరకు కొనసాగించాలని కోరుతున్నారట. నిజానికి మన ఇండస్ట్రీలో తెలుగు సినిమాలను పక్కన పెట్టి పరభాషా చిత్రాలకి ఎక్కువ థియేటర్లు కేటాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో మన తెలుగు సినిమా కష్టాలు పడుతుంటే పరభాషా చిత్రాలు లాభాలు ఆర్జించుకొని వెళ్తుంటాయి. 'నో థియేట‌ర్స్ ఫ‌ర్ డ‌బ్బింగ్ మూవీస్' అనే ప‌ద్ధ‌తి ఆల్రెడీ నిన్న మొన్న‌టి వరకు క‌న్న‌డ నాట కొన‌సాగింది. అక్క‌డ డ‌బ్బింగ్ సినిమాల్ని రిలీజ్ చేసే వారు కాదు. వారి భాష‌లో సినిమా రిలీజ్ చేయాలంటే స‌దరు క‌థ రీమేక్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడిప్పుడే క‌న్నడ వారు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండ‌టంతో అక్క‌డ ప‌ద్ధ‌తులు కూడా మారాయి. అయితే ప్ర‌స్తుత పరిస్థితుల వ‌ల్ల మ‌ళ్లీ 'నో థియేట‌ర్స్ ఫ‌ర్ డ‌బ్బింగ్ మూవీస్' అనే నినాదం మళ్లీ వినిపిస్తోందట. తెలుగులో కూడా ఇదే పద్ధ‌తిని తీసుకురావడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట. త్వరలోనే 'ఏ డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్స్ ఇవ్వం' అని తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ నుంచి ప్ర‌క‌ట‌ణ వ‌చ్చే అవ‌కాశం కూడా ఉందట.

కానీ అదే సమయంలో మన సినిమాలు పక్క ఇండస్ట్రీలలో డబ్బింగ్ చిత్రాలే అవుతాయి కదా. ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న హీరో నుండి పెద్ద హీరో దాకా అందరూ పాన్ ఇండియా సినిమాల వైపే చూస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న ప్రతీ సినిమా ఐదు ఆరు భాషల్లో తెరకెక్కుతున్నవే. మరి అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అక్కడ మన సినిమాల విషయంలో కూడా వాళ్ళు అలానే ఆలోచిస్తారు కదా. మరి అది మన సినిమాకి నష్టమే కదా అని కూడా మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.