Begin typing your search above and press return to search.

ధోని సినిమా మనకు లేదా?

By:  Tupaki Desk   |   17 Aug 2016 3:30 PM GMT
ధోని సినిమా మనకు లేదా?
X
మహేంద్ర సింగ్ ధోనికి ఇండియాలో ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో.. అతడి జీవిత కథతో తెరకెక్కుతున్న ‘ఎం.ఎస్.ధోని’ ట్రైలర్ రిలీజైనపుడు అందరికీ మరోసారి తెలిసొచ్చింది. సుశాంత్ రాజ్ పుత్ లాంటి చిన్న హీరో ఈ సినిమాలో కథానాయకుడిగా నటించినా సరే.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ల సినిమాలకు కూడా లేనంత రెస్పాన్స్ ఈ సినిమా విషయంలో కనిపిస్తోంది. మొన్న ట్రైలర్ రిలీజైన తొలి రోజే 52 లక్షల మంది చూశారు. రెండు రోజుల్లోనే కోటి మార్కును టచ్ చేసింది ఈ ట్రైలర్. ఇది చూశాక సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. టీమ్ ఇండియాలోకి రావడానికి ముందు ధోని ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

విశేషం ఏంటంటే ‘ఎం.ఎస్.ధోని’ సినిమాను తమిళంలోకి కూడా అనువదిస్తున్నారు. ఆల్రెడీ తమిళ అనువాద కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. హిందీ ట్రైలర్ రిలీజైన మూడు రోజులకే తమిళ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ధోని అంటే అందరికీ అభిమానమే కానీ.. తమిళ జనాలకు మరింత ఎక్కువ అభిమానం. ఎనిమిదేళ్ల పాటు ఐపీఎల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. అక్కడి అభిమానులతో మమేకమవుతూ.. వాళ్ల సొంత మనిషిలాగా అయిపోయాడు ధోని. అందుకే తమిళనాట ధోని సినిమాకు మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ధోనికి మంచి ఫాలోయింగే ఉంది. తెలుగులోకి కూడా ఈ చిత్రాన్ని అనువాదం చేస్తే ఎక్కువ మందికి చేరువువుతంది. మరి దర్శక నిర్మాతలకు ఆ ఆలోచన ఉందో లేదో?