Begin typing your search above and press return to search.

ఎన్నేళ్లయిందో బాక్సాఫీస్‌ను ఇలా చూసి..

By:  Tupaki Desk   |   17 July 2015 11:11 PM IST
ఎన్నేళ్లయిందో బాక్సాఫీస్‌ను ఇలా చూసి..
X
ఎంత డల్ సీజన్లో అయినా సరే.. ప్రతి శుక్రవారం కొత్త సినిమా బొమ్మ పడాల్సిందే. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పరీక్షల సీజన్లో కూడా ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతూనే వచ్చాయి. ఒకవేళ ఏదైనా భారీ సినిమా ముందు వారం విడుదలైనా సరే.. తర్వాతి వారానికి ఏదో ఒక చిన్న సినిమాదైనా కొత్తగా థియేటర్లలోకి రావాల్సిందే. కానీ బాహుబలి పుణ్యమా అని.. చాలా ఏళ్ల తర్వాత శుక్రవారం తెలుగులో ఒక్క కొత్త సినిమా కూడా విడుదల కాని పరిస్థితి తలెత్తింది. బాహుబలి రావడానికి ముందు వారం దాదాపు అరడజను చిన్న సినిమాలు విడుదలయ్యాయి కానీ.. ఈ వారం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజవ్వలేదు.

ఇలాంటి పరిస్థితి చివరగా ఎప్పుడుందో కూడా ఎవ్వరికీ గుర్తు లేదు. హైదరాబాద్ వరకు హిందీ సినిమా ‘భజరంగి భాయిజాన్’ సందడైనా కనిపిస్తోంది కానీ.. మరో తెలుగు సినిమా పోస్టర్ మాత్రం దర్శనమివ్వట్లేదు. బాహుబలి రాకతో అప్పటిదాకా ఆడుతున్న సినిమాలన్నింటినీ థియేటర్ల నుంచి ఊడ్చేశారు. ఒకటీ అరా థియేటర్లలో తప్ప బాహుబలి సినిమానే వేశారు. ఈ శుక్రవారానికి జేమ్స్ బాండ్ సినిమాను విడుదల చేయాలని ముందు అనుకున్నారు కానీ.. బాహుబలి ప్రభంజనం చూశాక ఆ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. రెండో వారానికి కూడా బాహుబలి దాదాపు 80 శాతం థియేటర్లలో ఆడుతుండటం విశేషం. మిగతా వాటిలో భజరంగి భాయిజాన్, ఇంకేవో ఒకటీ అరా తెలుగు సినిమాలు, ఇంగ్లిష్ మూవీస్ నడుస్తున్నాయి.