Begin typing your search above and press return to search.

మెగా హీరో పైసా తీసుకోలేదట

By:  Tupaki Desk   |   18 Jun 2018 12:59 PM IST
మెగా హీరో పైసా తీసుకోలేదట
X
‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లతో ఒక టైంలో మంచి ఊపుమీద కనిపించాడు సాయిధరమ్ తేజ్. కానీ తర్వాత సినిమాల ఎంపికలో వేసిన తప్పటడుగులు అతడి కెరీర్ ను దెబ్బ తీశాయి. వరుస డిజాస్టర్లతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘తేజ్ ఐ లవ్యూ’ మీదే ఉన్నాయి. కె.ఎస్.రామారావు లాంటి పెద్ద నిర్మాత అతడితో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఆయన చిరంజీవికి ఎంతో సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి తేజు ముందుగా పారితోషకం ఏమీ తీసుకోలేదట. తన ట్రాక్ రికార్డు.. చిరంజీవితో రామారావుకు ఉన్న స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని అతను ఈ నిర్ణయం తీసుకున్నాడట. తన మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో రెమ్యూనరేషన్ తీసుకుంటే రామారావుకు బర్డెన్ అవుతుందని ఆగాడట.

సినిమా రిలీజ్ తర్వాత లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కూడా ఏమీ జరగలేదట. ఐతే రామారావు ఆలోచన మాత్రం ఇదే అంటున్నారు. సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోయినప్పటికీ ఫలితం విషయంలో ధీమాగా ఉన్నాడు రామారావు. ఖర్చులన్నీ పోనూ లాభాలు వస్తే తేజుకు అందులోంచి వాటా ఇద్దామని ఆయన చూస్తున్నాడట. మరి ‘తేజ్ ఐ లవ్యూ’ ఆయన నమ్మకాన్ని ఏమేరకు నిలబెడతుందో చూడాలి. తేజు మాత్రం ఏమీ ఆశించకుండా ఈ సినిమా చేశాడట. ‘తొలి ప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రూపొందించిన ఈ చిత్రంలో తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. జులై 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందనే వస్తోంది.