Begin typing your search above and press return to search.

అదుగో సౌండ్ లేని వరాహం!

By:  Tupaki Desk   |   4 Nov 2018 7:09 AM GMT
అదుగో సౌండ్ లేని వరాహం!
X
విలక్షణమైన సినిమాలు చేస్తాడని పేరున్న రవిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న అదుగో మరో మూడు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. మొన్న హైదరాబాద్ లో రెండు కిలోమీటర్లు కూడా దూరం లేని కెబిఆర్ పార్కు నుంచి ఫిలిం నగర్ ఛాంబర్ దాకా పాదయాత్ర అంటూ హడావిడి చేయడం తప్ప అదుగో ప్రమోషన్ పెద్దగా కనిపించడం లేదు. హీరో హీరోయిన్లను పేరు లేని వాళ్ళను తీసుకుని కేవలం ఒక చిన్న పంది పిల్లను నటింపజేసి గ్రాఫిక్స్ సహాయంతో ఎంటర్ టైనర్ తరహాలో రూపొందిన ఈ మూవీకి ఆశించిన బజ్ ప్రేక్షకుల్లో లేదు.

కనీస స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయా అనే అనుమానం ట్రేడ్ లో సైతం నెలకొంది. సురేష్ బాబు నిర్మాత కాబట్టి విడుదల పరంగా ఇబ్బందులు లేకపోయినా థియేటర్ కు జనం రావాలి అంటే అందులో ప్రత్యేకంగా అనిపించే అంశం ఏదైనా ఉండాలి. కానీ అదుగోకు అదే శాపంగా మారుతోంది. దానికి తోడు ఇది రెండేళ్ల నుంచి నిర్మాణంలో ఉండటం అనుమానాలకు తావిచ్చేదే. నిజానికి సినిమాల్లో జంతువులను ప్రధాన పాత్రలో పెట్టి తీయడం కొత్త ట్రెండ్ కాదు. కుక్క-పాము-ఏనుగు-సింహం-పులి-చింపాంజీ లాంటి వాటితో గతంలోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. అవి మెచ్చడానికి కనెక్ట్ కావడానికి కారణం వాటికున్న ప్రత్యేకమైన స్వభావం.

కానీ పంది పిల్ల విషయంలో అలా ఉండదు. జనం దగ్గరకు వెళ్లేందుకు కూడా ఇష్టపడని పందిని హీరోగా పెట్టడమే ఓరకంగా నెగటివ్ అని చెప్పాలి. దానికి తోడు లీడ్ పెయిర్ అభిషేక్ వర్మతో నభా నటేష్ లకు ఎలాంటి ఇమేజ్ లేదు. ఈ నేపథ్యంలో ముందు రోజు విజయ్ సర్కార్ తర్వాతి రోజు బాలీవుడ్ మల్టీ స్టారర్ తగ్స్ అఫ్ హిందుస్థాన్ ల మధ్యలో పోటీలో నలిగిపోకుండా పంది పిల్ల గెలవడం సవాలే. రవిబాబు నమ్మకంగానే ఉన్నాడు కానీ బయట పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం చూస్తే లేని బజ్ ని ఎలా తెచ్చుకుంటుందా అనే అనుమానం కలుగుతుంది