Begin typing your search above and press return to search.

కొరటాల అనే నేను

By:  Tupaki Desk   |   9 March 2018 10:06 AM IST
కొరటాల అనే నేను
X
సామాజిక సమస్యలపై సినిమా తారలు, దర్శకులు అదే పనిగా కాదు కాని అవసరమైనప్పుడు స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడెప్పుడో దివిసీమకు తుపాను వచ్చినప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలందరూ జోలె పట్టుకుని చందాలు వసూలు చేసి బాధితులకు అందించడం మొదలుకొని ఆ మధ్య వచ్చిన హూద్ హూద్ - చెన్నై వరదలకు అందరు కలిసికట్టుగా నడుం బిగించడం అందరం చూసాం. కాని వీటికి రాజకీయంగా లింక్ ఏమి లేదు కాబట్టి స్పందన పాజిటివ్ గా వచ్చింది. కాని ఎప్పుడైతే ఏదైనా సమస్యకు పొలిటికల్ కనెక్షన్ ఉంటుందో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. భరత్ అనే నేను దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు అదే పరిస్థితి ఎదురుకుంటున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లో గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న శివ నరేంద్ర మోడీని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టడం సర్వత్రా చర్చకు దారి తీసింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి మోడీ మ్యాన్ అనిపించుకోవాలని తన సినిమాలో మహేష్ బాబు డైలాగ్ స్టైల్ లో ట్వీట్ చేయటం బాగా వైరల్ అయ్యింది. దీనికి అధిక శాతం అభిమానులు మద్దతు పలికారు. కాని కొందరు మాత్రం కౌంటర్లు స్టార్ట్ చేసారు. మోడీని ఇంత మాట అన్న మీరు చంద్రబాబునాయుడుని ఎందుకు అనలేకపోతున్నారని-నాలుగేళ్ళు సైలెంట్ గా ఉన్న మీకు ఇప్పుడే రాష్ట్ర సమస్య గుర్తుకు వచ్చిందా అని-సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి మెసేజులు పెడతారా అని రకరకాలుగా బాణాలు సంధిస్తూనే ఉన్నారు. అయినా కొరటాల ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. దర్శకుడే కాదు కలం బలం తెలిసిన రచయిత కూడా.

తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, ఒక విపత్తు వచ్చినప్పుడు లేక ప్రజల హక్కులకు భంగం కలుగుతోంది అని అనిపించినప్పుడు ఒక పౌరుడిగా స్పందించడం తన హక్కని అంతే కాని సినిమాని ఇలా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సుతిమెత్తగా చెప్పేసాడు. అయినా ప్రశ్నించడం కూడా తప్పేనా అంటూ కొరటాల అండ్ మహేష్ సపోర్టర్స్ అతనికి బాసటగా నిలుస్తున్నారు. కొరటాల అనే నేను వీటికి భయపడను, సమాధానం ఇచ్చే తీరతాను అని చెప్పడం చూస్తే ముందు ముందు ఇంకే ట్వీట్స్ పెడతాడో అన్న ఆసక్తి కలుగుతోంది.