Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ కి 'ఆస్కార' మే లేదా?

By:  Tupaki Desk   |   22 Sep 2018 11:36 AM GMT
టాలీవుడ్‌ కి ఆస్కార మే లేదా?
X
ఆస్కార్ 2019 గురించి అప్పుడే ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈసారి ప్రాంతీయ భాషా విభాగం కేట‌గిరీలో దేశం నుంచి ఏఏ సినిమాలు నామినేష‌న్ల‌కు వెళుతున్నాయో సాయంత్రానికి ఒక నివేదిక రానుందిట‌. ఎప్ప‌టిలానే హిందీ - మ‌రాఠీ - త‌మిళం - గుజ‌రాతీ - అస్సామీ అంటూ అన్ని భాష‌ల నుంచి సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో మ‌న తెలుగు సినిమాలు ఎక్క‌డ‌? టాలీవుడ్ క‌హా హై? అని వెతికితే అస్స‌లు ఇంత‌వ‌ర‌కూ క్లూ కూడా లేదు. క‌నీసం హింటు కూడా జాన్తా న‌య్‌!

ఇప్ప‌టివ‌ర‌కూ ఫిలింఛాంబ‌ర్ - నిర్మాత‌ల మండ‌లి త‌ర‌పున కూడా మ‌న సినిమాల్లో ఏవైనా ఆస్కార్ నామినేష‌న్ల‌కు వెళుతున్న విష‌యాన్ని ప్ర‌క‌టిస్తాయేమో అని వేచి చూస్తే అట్నుంచి కూడా ఏ స్పంద‌నా లేదు. ఇక‌పోతే తెలుగు సినిమా అస‌లు అవార్డులు అందుకోవ‌డానికి అన‌ర్హ‌మా? అంటూ ఆస‌క్తిక‌ర డిబేట్ మొద‌లైంది. ఇన్నాళ్లు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కే ప‌రిమిత‌మైన తెలుగు సినిమాలో ఇటీవ‌ల కొంత‌కాలంగా కొత్త ఒర‌వ‌డి క‌నిపిస్తోంది. హీరోయిజాన్ని క‌థ డామినేట్ చేసేస్తోంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అస‌లు స్టార్‌ డ‌మ్‌ తో పనే లేకుండా కొత్త కుర్రాళ్ల సినిమాలు - ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌కు జ‌నం ప‌ట్టంగ‌డుతున్నారు. అవే బ్లాక్‌ బ‌స్ట‌ర్లు - ఇండ‌స్ట్రీ రికార్డులు అందుకుంటున్నాయి. అయితే వీటిలోంచి ఏదీ ఆస్కార్ నామినేష‌న్ అన్న ఆలోచ‌న‌లో లేనే లేవా? క‌నీసం జాతీయ అవార్డుల రేసుకు అయినా వెళ‌తాయంటారా?

ఈ ఏడాది రిలీజైన రంగ‌స్థ‌లం - భ‌ర‌త్ అనే నేను - మ‌హాన‌టి చిత్రాల‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లొచ్చాయి. క‌మ‌ర్షియ‌ల్‌ గానూ రికార్డులు సృష్టించాయి. అంతేకాదు ఆయా చిత్రాల్లో న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌కు విమ‌ర్శ‌కులు మంచి మార్కులేశారు. అయితే ఈ సినిమాలేవీ అవార్డుల కేట‌గిరీలో లేవా? అందుకు ప‌నికి రావ‌ని భావించి మ‌న‌వాళ్లు నామినేష‌న్ల‌కు కూడా పంపించ‌లేదా? ఏమో .. మ‌న‌బోటి సామాన్యుల‌కు అర్థంకాని వ్య‌వ‌హార‌మిది. ఇంత‌కీ మ‌నోళ్ల‌లో క‌ద‌లిక లేదంటారా? ఉన్నా క‌మిటీ వాళ్లు ప‌ట్టించుకోలేదా? .. అన్న‌ట్టు ప్ర‌స్తుతం ఆస్కార్ బ‌రిలోకి వెళుతున్న హిందీ సినిమాలు ఎంత వ‌ర‌కూ నెగ్గుకొస్తాయి? అవి కూడా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ సినిమాలే క‌దా నిశితంగా ప‌రిశీలిస్తే? ఇక‌పోతే .. `రంగ‌స్థ‌లం` చిత్రంలో చిట్టిబాబు - రామ‌ల‌క్ష్మిల‌ న‌ట‌న‌ - `భ‌ర‌త్ అనే నేను`లో డీసెంట్ సీఎంగా మ‌హేష్ న‌ట‌న‌ - `మ‌హాన‌టి` చిత్రంలో సావిత్రి పాత్ర‌ధారి కీర్తి సురేష్ న‌ట‌న‌ - అమాయ‌క జ‌ర్న‌లిస్టు మ‌ధురవాణిగా స‌మంత‌ న‌ట‌న అస‌లు అవార్డుల‌కు ప‌నికి రావంటారా? ఆస్కార్ నామినేష‌న్ల‌లో టాలీవుడ్ యాడుంది?