Begin typing your search above and press return to search.

కీర్తి ఉంది.. ఆఫర్సే లేవు

By:  Tupaki Desk   |   9 March 2016 2:30 PM GMT
కీర్తి ఉంది.. ఆఫర్సే లేవు
X
ఏ హీరోయిన్ కి అయినా తొలి సినిమాతోనే ఆకట్టుకోవడం వేరు, హిట్ కొట్టడం వేరు. ఈ రెండూ అరంగేట్ర మూవీతోనే సాధిస్తే, సాధారణంగా ఆ భామకు డిమాండ్ పిచ్చపిచ్చిగా ఉంటుంది. కానీ కీర్తి సురేష్ కి మాత్రం టైం పెద్దగా కలిసొచ్చినట్లు లేదు. టాలీవుడ్ లో తన తొలి మూవీ నేను.. శైలజ.. తో మంచి యాక్ట్రెస్ అనిపించుకుంది. అమ్మడి అందం కూడా టాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకూ కొత్త ఆఫర్ ఏమీ దక్కించుకోలేక పోయింది.

నేను.. శైలజ.. రిలీజై రెండు నెలలకు పైగా అయింది. అయితే ఇంకా తెలుగులో కొత్త సినిమా దేనికీ సైన్ చేయలేదు ఈ మలయాళ సుందరి. నిజానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తని ఒరువన్ రీమేక్ లో.. కీర్తి సురేష్ నే తీసుకుంటారనే వార్తలొచ్చాయి. కానీ ఈ ఆఫర్ రకుల్ ప్రీత్ సింగ్ కి వెళ్లిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలో కూడా హీరోయిన్ రేస్ లో కీర్తి పేరు వినిపించింది. ఇప్పుడీ ఆఫర్ పరిణీతి చోప్రాకి దక్కినట్లు తెలుస్తోంది.

తమిళ్ చిత్రాల్లో ప్రస్తుతం కీర్తి సురేష్ బిజీగానే ఉన్నా.. తెలుగులో మాత్రం టైం కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి స్టార్స్ అంతా బిజీగా ఉండడంతో.. టాలీవుడ్ లో మంచి ఆఫర్ కోసం అమ్మడికి ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.