Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రో వీడియోపై ఇంకా క్లారిటీ లేదంట...!

By:  Tupaki Desk   |   14 May 2020 5:15 AM GMT
ఎన్టీఆర్ స్పెషల్ ఇంట్రో వీడియోపై ఇంకా క్లారిటీ లేదంట...!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ లో మరో హీరో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. 'రౌద్రం రణం రుధిరం' మూవీలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్'గా కనిపిస్తుండగా 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు చరణ్ ఇంట్రో వీడియో విడుదలయ్యాయి. 'అల్లూరి'గా రామ్ చరణ్ లుక్ చూసినప్పటి నుండి 'కొమరం భీమ్' గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న కోరిక సినీ అభిమానులకు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా గ్యారంటీ గా స్పెషల్ వీడియో ఉంటుందని తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

అంతే కాకుండా జక్కన్న ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ఎలా చూపించబోతున్నాడో అని ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ స్పెషల్ ఇంట్రో వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేసినట్లే.. ఎన్టీఆర్ స్పెషల్ వీడియోని రామ్ చరణ్ రిలీజ్ చేస్తాడ‌ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. తారక్ పుట్టిన రోజుకి ఇంకా కొద్దీ రోజులే ఉంది. ఈ లెక్కన చూస్తే ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు రాకుండా.. తారక్ - చరణ్ లను కంపేర్ చేయకుండా ఉండాలంటే ఇప్ప‌టికే జక్కన్న ఎన్టీఆర్ మీద ఓ యాక్ష‌న్ టీజ‌ర్ క‌ట్ చేసి ఉండాలి. కానీ ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్న ప్ర‌కారం ఇంకా రాజమౌళి టీజ‌ర్ ర‌ఫ్ వెర్ష‌న్ మీద ఓ క్లారిటీ ఇవ్వ‌లేద‌ని తెలిసింది. దీంతో తారక్ వీడియోని విడుదల చేస్తాడా లేదా అనే అనుమానం కలుగుతోంది. మరి జక్కన్న ఏమి ప్లాన్ వేశాడో. ఎవరూ ఊహించనిది చేయడమే కదా జక్కన్న స్పెషాలిటీ.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఆర్.ఆర్.ఆర్ తెలుగు తో పాటు ఇతర భారతీయ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో రే స్టీవెన్‌ సన్‌, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, బాలీవుడ్ స్టార్స్ అలియా భట్ - అజయ్ దేవగణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. రాజమౌళి 'బాహుబలి' తర్వాత తీస్తున్న సినిమా కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటం తో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.