Begin typing your search above and press return to search.

సెన్సార్ క‌త్తెర‌కు ప‌ని త‌గ్గుతోంది!

By:  Tupaki Desk   |   9 Nov 2016 6:10 AM GMT
సెన్సార్ క‌త్తెర‌కు ప‌ని త‌గ్గుతోంది!
X
ఇక‌పై, మ‌న సినిమాల్లో బీప్ సౌండ్లు ఉండ‌వు! సెన్సార్ క‌త్తెర్లు ఉండ‌వు! సినిమాలో ఏది చూపించాల‌నుకున్నా... డైలాగుల్లో ఏది వినిపించాల‌నుకున్నా సెన్సార్ అభ్యంత‌రాలు త‌గ్గ‌బోతున్నాయ‌నే చెప్పాలి. టోట‌ల్ గా సెన్సార్ బోర్డు ప‌ని కాస్త త‌గ్గుతోంది. సినిమాల సెన్సార్ల‌కు సంబంధించి కొత్త నిబంధ‌ల‌పై సుప్ర‌సిద్ధ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెనెగ‌ల్ సార‌థ్యంలోని ఒక క‌క‌మిటీ తాజాగా ఓ నివేదిక‌ను సిద్ధం చేసింది. ఆ ప్ర‌తిపాద‌న‌ల‌ ప్ర‌కారం సెన్సార్ స‌ర్టిఫికేష‌న్ లో మ‌రికొన్ని కొత్త కేట‌గిరీలు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ నివేదిక‌ను సెన్సార్ బోర్డు కూడా ఆమోదించింది. అయితే, ఇవి వెంట‌నే అమ‌ల్లోకి రావాలంటే స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ‌ శాఖ ఆమోదం తెల‌పాల్సి ఉంది. ఆ త‌రువాత‌, సినిమాటోగ్రాఫ్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ కూడా అవ‌స‌రం అవుతుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం మ‌న సినిమాల సెన్సార్ విష‌యంలో... ఎలాంటి అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలూ మితిమీరిన హింసా అశ్లీల దృశ్యాలు లేవ‌నుకుంటే వాటికి క్లీన్ ‘యు’ స‌ర్టిఫికేట్ ఇస్తున్నారు. హింసా శృంగారం డోస్ కాస్త ఎక్కువ ఉన్న చిత్రాల‌కు ‘ఎ’ స‌ర్టిఫికేట్ తో రిలీజ్ చేస్తున్నారు. వీటి డోస్ కాస్త త‌గ్గించుకుని, నాలుగు క‌త్తెర్లు వేయించుకుంటే అలాంటి వాటికి ‘యు.ఎ.’ ఇస్తున్నారు. ఈ కేట‌గిరీ చిత్రాల‌ను అంద‌రూ చూడొచ్చ‌న్న‌మాట‌. 12ఏళ్ల లోపువారి విష‌యంలో ఈ చిత్రాల‌ను చూపించాలా వ‌ద్దా అనేది త‌ల్లిదండ్రుల ఇష్టానికే వ‌దిలేశారు. అయితే, బెనెగెల్ క‌మిటీ సిఫార్సుల ప్రకారం.. యు, యుఏల‌తోపాటు యూఏ 12, యూఏ 15 ప్ల‌స్ లుగా విభ‌జించ‌నున్నారు.

ఇక‌, ‘ఎ’ కేట‌గిరీ విష‌యంలో కూడా ఏ తోపాటు ‘ఏసీ’ క్యాట‌గిరీని కూడా పెట్టాల‌ని సూచించారు. ఏసీ అంటే ఎడల్ట్ విత్ కాష‌న్ అని అర్థం. అంటే, కొత్త ప్ర‌తిపాద‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తే మ‌న సినిమాల్లో బీప్ సౌండ్స్ ఉండ‌వు. శృంగార సన్నివేశాల‌కు కూడా క‌ట్స్ ప‌డ‌వు. అలాంటి ఏవి ఉన్నా ఆయా కేట‌గిరీల స‌ర్టిఫికెట్లు మాత్ర‌మే జారీ చేస్తారు. అంతేత‌ప్ప‌, క‌టింగులు ఉండ‌వ‌న్న‌మాట‌! మ‌రి, ఆ ర‌కంగా సెన్సార్ బోర్డువారికి చాలా ప‌ని త‌గ్గుతుంద‌ని చెప్పుకోవాలి. బెనెగెల్ క‌మిటీ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మాచార ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌కు అందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/