Begin typing your search above and press return to search.

ఇందులో నాని తప్పేముంది?

By:  Tupaki Desk   |   2 March 2018 11:32 AM IST
ఇందులో నాని తప్పేముంది?
X
హీరో ఎవరైనా సినిమా పరిశ్రమలో వరసగా వచ్చే విజయాలు ఊహించని స్టార్ డం ఇచ్చే మాట నిజమే. అందులో అనుమానం లేదు. స్వయంకృషితో ఎదిగిన నటుడైనా లేక వారసత్వం కార్డుతో ఎంట్రీ ఇచ్చి టాలెంట్ తో పైకొచ్చిన హీరో అయినా ఇది అందరికి వర్తిస్తుంది. ఫైనల్ గా ఇక్కడ తలరాతను నిర్ణయించేది కెరీర్ ను నడిపించేది సక్సెస్ అనేది ఎవరు కాదనలేని సూత్రం. అందుకే విజయలక్ష్మి వరిస్తునప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా. న్యాచురల్ స్టార్ నాని విషయంలో గత కొద్ది రోజులుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో తను స్క్రిప్ట్ ల విషయంలో జోక్యం చేసుకోవడంతో పాటు మాస్ కు కావాల్సిన అంశాలు జొప్పించే విధంగా దర్శకులను - రచయితలను ఒత్తిడి చేస్తున్నాడని కథనాలు ప్రచురించారు. కాని ఒక్కసారి నిజానిజాలు శల్య పరీక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ పూర్తిగా అది వాణిజ్య సూత్రాలకు లోబడి ఉంటుంది. హీరో కూడా తనకు ఎన్ని సినిమాలు వస్తున్నాయి అనేది చూసుకోవడం కాదు ముఖ్యం. తన దగ్గరకు వస్తున్న కథలు ప్రేక్షకుల దృష్టిలో తనను ఎలా నిలబెడతాయి అన్నది చూసుకోవాలి. నాని చేస్తోంది అదే. గత ఏడాది ఎంసిఎ డివైడ్ టాక్ - రివ్యూస్ తో ఓపెన్ అయినప్పుడు చాలా చోట్ల అది సేఫ్ గా నిలవడానికి కారణం నాని ఇమేజ్ అనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే క్రమంలో కథల ఎంపికలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఈ రోజు లైం లైట్ లో ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ పొగిడిన వాళ్ళే రేపు ఏదైనా తేడా వచ్చిన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా తప్పించుకు తిరుగుతారు. ఎవరి కెరీర్ కు వాళ్ళే బాధ్యులు అన్న సత్యం నానికి తెలియక కాదు.

ఇది గతంలో చాలా సార్లు ప్రూవ్ అయిన సత్యమే. తొందపాటుతనం గతంలో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఇద్దరు యువ హీరోల కెరీర్లను త్వరగా ముగిసేలా చేసింది.అందులో ఒక హీరో ఈ మధ్యే రీ ఎంట్రీ ఇస్తే ఎవరూ కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అందుకే నాని చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇటీవలే దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన కథలో మార్పులు చేయకపోవడం వల్లే నాని వదులుకున్నాడని, అది కాస్త సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కు వెళ్లిందని కొన్ని వెబ్ సైట్స్ లో రావడం చర్చకు వచ్చింది. నిజానికి కిషోర్ తిరుమల అయినా ఇంకే దర్శకుడైనా హీరో తన వంతు బాధ్యతగా న్యాయం అనిపించిన మార్పులు చెప్పడంలో తప్పు లేదు. నాని చెప్పాడో లేదో తెలియదు కాని ఇలా కథను వద్దనుకున్నాడు కాబట్టి న్యాచురల్ స్టార్ నుంచి ఇంకో స్టార్ గా మారుతున్నాడు అని రాసేయడం మాత్రం కరెక్ట్ కాదు.

నాని మీద ఇప్పుడు సినిమాకు 30 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కంటెంట్ లో తేడా వచ్చినప్పుడు హీరోని నిందించాకే దర్శకుడిని అంటున్నారు. కాబట్టి చాలా కీలకమైన కెరీర్ దశలో నాని ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం కరెక్టే. ఇప్పుడు చేస్తున్న కృష్ణార్జున యుద్ధం దర్శకుడి వయసు కేవలం రెండు సినిమాలు. మొన్న వచ్చిన ఎంసిఎ దర్శకుడు తీసింది అంతకు ముందు ఒకే ఒక్క ఫ్లాప్ సినిమా. ఒక డెబ్యు డైరెక్టర్ చెప్పిన కథ వినగానే వద్దు అనిపించే అ! ను రిస్క్ చేసి మరీ తన పెట్టుబడి పెట్టాడు. నేను లోకల్ డైరెక్టర్ అంతకు ముందు రాజ్ తరుణ్ లాంటి అప్ కమింగ్ హీరోతో మాత్రమే హిట్ కొట్టి ఉన్నాడు.నిన్ను కోరితో పరిచయం చేసింది కూడా కొత్త టాలెంటేగా. ఇలా చెప్పుకుంటూ ప్రతిభను గుర్తించడంలో నాని ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఇది అతన్ని వెనకేసుకోవడం కాదు. వాస్తవాలను విశిదీకరించడం. అంచనాలు సినిమా సినిమాకు ఎగబాకుతునప్పుడు ఒకటిరెండు సార్లు స్క్రిప్ట్ ను కాని కథను కాని జల్లెడ పట్టి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఒక దర్శకుడు కథ చెప్పగానే మార్పులు సూచించినందుకు హీరో ప్రవర్తన మారింది అనే సర్టిఫికేట్ ఇస్తున్న వాళ్ళది అమాయకత్వమే తప్ప మరొకటి కాదు.