Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల క్రేజ్ ఏమైంది?

By:  Tupaki Desk   |   8 Jan 2019 2:30 PM GMT
సంక్రాంతి సినిమాల క్రేజ్ ఏమైంది?
X
తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు అతి పెద్ద సీజన్ సంక్రాంతే. ఆ టైంలో ఒకేసారి మూణ్నాలుగు భారీ సినిమాలు రిలీజ్ చేస్తారు. మంచి టాక్ వస్తే అన్ని సినిమాలూ బాగా ఆడే అవకాశముంటుంది. మామూలు టైంలో కంటే ఈ సీజన్లో సినిమాలకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయన్నది స్పష్టం. సంక్రాంతి సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. పండగ సినిమాలకు మూణ్నాలుగు రోజుల కిందటే బుకింగ్స్ మొదలు కాగా.. ఆశించిన స్పందన కనిపించడం లేదు. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘యన్.టి.ఆర్’ లాంటి క్రేజీ సినిమాకు బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి.

మామూలుగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే తొలి రోజు అన్ని షోలకూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవాలి. ‘సోల్డ్ ఔట్’ మెసేజ్‌ లు కనిపించాలి. కానీ అలాంటి పరిస్థితి లేదు. హైదరాబాద్‌ ‌లో మహేష్ బాబు మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ లాంటి కొన్ని చోట్ల తప్ప అన్ని థియేటర్లలోనూ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక రజనీకాంత్ సినిమా ‘పేట’కు రిలీజ్ రోజు మాత్రం పెద్ద ఎత్తునే థియేటర్లు ఇచ్చారు. దానికి కూడా బుకింగ్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి.

శుక్ర, శనివారాల్లో రిలీజ్ కానున్న ‘వినయ విధేయ రామ’, ‘ఎఫ్-2’ సినిమాలకు పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఉన్నవాటిలో బుకింగ్స్ అంత ఆశాజనకంగా అయితే లేవు. మామూలుగా ఇలా పెద్ద సినిమాలు రిలీజవుతుంటే.. టికెట్లు పెట్టడం ఆలస్యం సేల్ అయిపోతుంటాయి. ఐతే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రేక్షకులకు ఎక్కువ ఆప్షన్లు ఉండటం వల్లో.. లేక జనాలు పండగల కోసం ఊర్లకు వెళ్లే సన్నాహాల్లో ఉండటం వల్లో.. కారణం ఏదైనా కానీ సంక్రాంతి సినిమాలకు బుకింగ్స్ అయితే ఆశాజనకంగా లేవు.